ఇక ఇంతకుమించి మరే సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15, 000 చొప్పున అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ .1500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు సాగు ప్రోత్సాహం కింద సంవత్సరానికి రూ .20వేల నగదు సహాయం ఇలా పథకాలు చెప్పారు. కానీ వీటిని మాత్రం అమలు చేయలేదు.
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఈ పథకాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు. ప్రస్తుతం చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలతో వైసిపి వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డారు. రాష్ట్రం దివాలా అంచున ఉందని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం వడ్డీలు కట్టడానికి మాత్రమే సరిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే పథకాలు అమలు చేయలేనని ఒకవేళ అమలు చేసినా ఆంక్షలు ఉంటాయని సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే నవరత్నాలు అమలు చేసి చూపించారు. సంక్షేమ పథకాలను అందించగలిగారు. కానీ చంద్రబాబు మాత్రం అంతకుమించి అనేసరికి ప్రజలు ఆయనకు చాన్స్ ఇచ్చారు. పథకాలు ఆశించిన వారితో పాటు జగన్ హయాంలో అభివృద్ధి లేదని భావించిన చాలామంది టిడిపికి మద్దతు పలికారు. కానీ ఇప్పుడు టిడిపి సంక్షేమ పథకాల విషయంలో జాప్యం చేస్తోంది. మరి ఈ పథకాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు శుభవార్త తెలుపుతుందో చూడాలి.