రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన వల్లభనేని వంశీ 2019లో రెండోసారి గెలిచిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ చెంత చేరిపోయారు.. అక్కడ వరకు బాగానే ఉంది. వైసిపి చెంత చేరిన వంశీ తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు - లోకేష్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. చివరకు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై సైతం వంశీ ఎంత దారుణమైన విమర్శలు చేశారో ? చూశాము. ఇదంతా గతం ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్న ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంశీ నియోజకవర్గానికి పూర్తి దూరంగా ఉంటున్నారు. తనపై కేసులు నమోదు కావడంతో విదేశాలకు చెక్కేశారు . ఇక గన్నవరం వైసీపీ రాజకీయాలలో వంశీ కొనసాగే అవకాశం కనబడటం లేదు.


ఈ క్రమంలోనే ఈ గ్యాప్ భర్తీ చేసుకునేందుకు వైసిపికి చెందిన ఓ మహిళా నాయకురాలు తెరమీదకి వస్తున్నారు. ఆమె ఎవరో ? కాదు గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జడ్పిటిసి డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి. 2014లో వైసీపీ నుంచి వంశీ పై పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్ర రావుకు ఈమె స్వ‌యాన కుమార్తె కావటం విశేషం. సీతారామలక్ష్మీ భర్త డాక్టర్ శివ భరత్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. గత ఐదేళ్లలో వైసీపీలో చేరిన వంశీ పై ఢీ అంటే ఢీ అనే రీతిలో శివభ‌ర‌త్‌ రెడ్డి పోరాటం చేశారు. ఇక ఇప్పుడు వంశీ అడ్డు తమకు తొలగిపోవడంతో తన భార్య సీతారామలక్ష్మికి గన్నవరం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించేలా శివ భర‌త్‌ రెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కాపు + రెడ్డి ఈక్వేషన్ లో సీతారామలక్ష్మికి గన్నవరం పగ్గాలు దక్కటంలో పెద్ద పోటీ ఉండదని వైసీపీలో కూడా చర్చ‌ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: