అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు మాత్రమే ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. సీఎంగా ప్రమా ణ స్వీకారానికి ముందు, సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అంతే. ఆ తర్వాత.. అందరూ వైసీపీ నాయకులు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇక, సీఎం జగన్ వచ్చిందే లేదు. పోనీ.. ఇప్పుడైనా ఆయన మీడియా ముందుకు వస్తారా? అంటే.. వస్తాను అని చెప్పారే కానీ... ఇప్పటికి ఒకే ఒక్కసారి మీడియా మీటింగ్ పెట్టారు.
నంద్యాల, వినుకొండల్లో పర్యటించినప్పుడు రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. అంతకు మించి ఆయన మీడియా అంటేనే భయ పడుతున్నారో.. లేక సిగ్గుపడుతున్నారో.. తెలియదు. కానీ, వాస్తవం ఏంటంటే.. ఆయన ట్విట్టర్‌ను నమ్ముకున్నారు. ట్విట్టర్‌లోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ, ఇవి ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తాయి? ప్రధాన మీడియాలో టీడీపీ అనుకూల పత్రికలు, మీడియా ఎట్టిపరిస్థితిలోనూ ప్రొజెక్టు చేయవు.
ఇక, ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉందని అనుకున్నా.. కోట్లలో ఉన్న జనాభాకు జగన్ వాయిస్ ఎప్పుడు వినిపిస్తుంది? అంటే.. ప్రశ్నగానే మారింది. దీనికి కారణం ఇంకా జగన్ వాస్తవాలను తెలుసుకోలేక పోవడమే. తాజాగా ఆయన సూపర్ సిక్స్‌పై ప్రశ్నలు సంధించారు. కానీ, అవి ప్రజల్లోకి వెళ్లలేదు. కేవలం టీడీపీనాయకులు మాత్రమే వాటిని చూసి.. పెదవి విరిచారు. ఇలా అయితే.. జగన్ వాయిస్ వినిపించేది ఎప్పుడు? అనేదానికి సమాధానం లేదు.