ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అధికార పార్టీ అయిన టీడీపీ నేతలు తమ ప్రత్యర్థులైన వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. టీడీపీ, వైసీపీ నేతల దాడుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. నిన్న శ్రీకాళహస్తిలో వైసీపీ నేతపై కత్తితో దాడి చేసిన ఘటన జరగక ముందే తాజాగా పెదకూరపాడులో వైసీపీ నేత కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అయిన కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున టీడీపీ నేతలు దాడులు చేపట్టారు. సుమారు 15 మంది స్వర్ణకుమారి ఇంట్లోకి వెళ్లి సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టారు. స్వర్ణకుమారి తల్లి గణేస్ శివమ్మను పక్కకు తోసేస్తూ గాయపరిచారు. తన భర్తను వెంటనే వారికి అప్పగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

భర్త లేడని చెప్పినా వినిపించుకోలేదు. పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకుడు అయిన కంకణాల శివాజీ తెలంగాణలో పలు కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటాడు. గత ఎన్నికల్లో తన భార్య స్వర్ణకుమారిని జెడ్పీటీసీగా నిలబెట్టి ప్రజల ఆదరణతో గెలిపించుకున్నాడు. శివాజీ, స్వర్ణకుమారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. దీంతో ఈ దంపతులు కొన్ని రోజులు అటు హైదరాబాద్‌లో ఇంకొన్ని రోజులు పెదకూరపాడులో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్వర్ణకుమారి, శివాజీలు ఇంట్లో ఉంటారని తెలిసి టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావు కారులో మాటు వేశారు.

ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు స్వర్ణకుమారి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. తలుపులు తీసిన ఆమెను బెదిరించారు. శివాజీ అంతు చూస్తామన్నారు. టీడీపీ నేతల దాడులపై జెడ్పీటీసీ స్వర్ణకుమారి పెదకూరపాడు ఎస్ఐ విపర్ల వెంకట్రావుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుండటంతో ఒకరకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజా పాలన సాగించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: