అదేవిధంగా కెఫీన్ హృదయ స్పందన రేటు, శక్తి వ్యయాన్ని తాత్కాలికంగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ల ప్రధాన వనరులలో కాఫీ ఒకటి. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఏ విధంగా సహకరిస్తాయి వేరే చెప్పాల్సిన పనిలేదు. గుండె జబ్బులు, క్యాన్సర్, అకాల వృద్ధాప్యంతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్, సెల్-డ్యామేజింగ్ మాలిక్యూల్స్ హానికరమైన ప్రభావాలతో పోరాడటానికి ఇవి సహకరిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించగలవు అనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు?
తగిన మోతాదులో కాఫీ తాగితే గుండె సమస్యలు, స్ట్రోక్స్, డయాబెటీస్ తదితర సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మ, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లు రాకుండా కూడా కాఫీ కాపాడుతుంది. అంతేకాదండోయ్... కాఫీ తాగడం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుందని కూడా చెబుతున్నారు. కాఫీలోని కెఫిన్ మన మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేయడానికి దోహదపడుతుంది. కాఫీ సువాసన, దాని రుచి మన మనస్సు శ్రేయస్సుకు సహాయపడుతుంది. రోజుకు 2 లేదా 3 కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. కాఫీ అలవాటు డిప్రెషన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, కాఫీని మితంగా తాగితేనే మంచిదని అంటున్నారు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇది వ్రాయబడింది. నిపుణుల సలహాలు, సూచనలు లేనిదే ఎటువంటి పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదు.