ఆయనొక సీనియర్ రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ఎవరైతే ఏముంది, సీఎం అయినా పీఎం అయినా.. ఓ భార్యకి భర్త మాత్రమే అంటారా? ఇది నిజమేనండోయ్! ఫారెస్ట్ రేంజ్‌లో యేళ్ల తరబడి కీలక విధుల్లో పనిచేసిన ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. దాంతో అలా ఖాళీగా ఇంట్లో కూర్చొనే బదులు ఏదో ఒక పని చేయొచ్చుగా? అని సదరు సతీమణి ఆర్డర్ వేసింది. దాంతో ఆయన కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు బయల్దేరాడు. కానీ ఇన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన ఎప్పుడూ ఇంటి బాధ్యతలు నిర్వహించింది లేదు. దాంతో ఉన్నట్లుండి కూరగాయల మార్కెట్‌కు పంపిస్తే ఏయే కూరగాయలు కొనాలి అడిగాడు ఆ మాస్టారు.
దాంతో ఆయన భార్య ఓ కాగితం తీసుకుని కొనదగిన కూరగాయల గుణగణాలను రాసి మరీ పంపింది. ఇక అది చూసిన సదరు అధికారి అవాక్కయ్యారు. కనీసం ఈ పాటి తెలివి తేటలు కూడా నాకు లేవా? అని తెగ మాధానపడిపోయాడట పాపం! దాంతో ఆయన భార్య చేతిరాతతో ఉన్న కూరగాయల లిస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టడంతో చూసిన వారంతా తెగ నవ్విపోతున్నారు మరి. మార్కెట్‌కు మొదటిసారి వెళ్తున్న తన భర్తకు ఏమేం కొనాలో, ఎలాంటివి కొనాలో ... ఆకారం, రంగు.. ఇలా తదితర అంశాలను సూచించే విధంగా ఓ పెద్ద లిస్ట్ ఆయన చేతికి ఇచ్చింది ఆ ఇల్లాలు. మామూలుగా ఇంటికి కావాల్సిన వస్తువులను ఒక చిన్న చీటీపై రాసి ఎవరైనా ఇస్తారు. దీనిపై అంత చర్చ అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమంటే... సదరు అధికారి భార్య ఇచ్చిన చీటిలో మాత్రం ఆలుగడ్డ, మిరపకాయలు, పాలకూర, ఉల్లి, బెండకాయ, టొమాటో, పాలు.. వంటి వాటి ఆకారం, రంగు, సైజు వంటి వివరాలతోసహా పేపర్ రాసి, ఆ పక్కనే వాటి బొమ్మలు కూడా గీసి.. బలే గమ్మత్తుగా రాసింది.
వివరాలు:
టమాటాలు పసుపు, ఎరుపు రంగుల్లో మాత్రమే ఉండాలి. రంధ్రాలు ఉండొద్దు. మెత్తగా ఉండకూడదు.
ఉల్లిపాయలు చిన్న సైజులో గుండ్రంగా ఉండాలి. మొలకలు ఉండకూడదు.
బంగాళాదుంపలు పెద్దగా ఉండకూడదు.
పాలకూర, మెంతికూర, బచ్చలికూర ఆకులు పచ్చగా పొడవుగా ఉండాలి. రంధ్రాల్లేకుండా ఉండాలి. పసుపు పచ్చగా ఉండకూడదు.
మిర్చీ పొట్టిగా మాత్రమే ఉండాలి. వీలైతే ఫ్రీగా అడగండి.
ఇక ఇవన్నీ ఫలానా చోట నుంచి మాత్రమే తీసుకురండి!
ఇలా స్పష్టమైన ఆదేశాలతో రాసి ఉన్న ఈ చీటీని చూసిన నెటిజన్లు ఆమె కొనుగోలు నైపుణ్యాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.