అతి చేసిన ఫలితాన్ని చంద్రబాబునాయుడు అనుభవిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా పంతం కొద్దీ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని పట్టుపట్టిన చంద్రబాబు అధికారాల్లో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం కోత పెట్టేశారు.  ఫణి తుపాను, మంచినీటి ఎద్దడి, కరువు, ఉపాధి హామీ పథకం అంశాలపై చర్చించాలని చంద్రబాబు పట్టుపట్టారు. అయితే, ఇదే అంశాలను ఎల్వీ ఆధ్వర్యంలో హాజరైన కమిటీ పరిశీలించింది.

 

క్యాబినెట్ సమావేశానికి ఎలక్షన్ కమీషన్ ను అనుమతి కోరాలని కమిటీ నిర్ణయించినా ఎటువంటి ఆర్ధిక అంశాలపైన నిర్ణయం తీసుకోకూడదని చంద్రబాబుకు స్పష్టం చేయాలని కమిటీ నిర్ణయించటం గమనార్హం. విచిత్రమేమిటంటే చంద్రబాబుకు చీఫ్ సెక్రటరీ ఆంక్షలు విధించటం. అంటే రేపటి రోజున ఎన్నికల సంఘం క్యాబినెట్ సమావేశానికి అనుమతిచ్చినా షరతులతో కూడిన అనుమతి మాత్రమే వస్తుందన్నది గుర్తించాలి. ఆర్దిక పరమైన అంశాలు చర్చించేందుకు లేదని సిఎంతో పాటు మంత్రులకు కూడా ముందే చెప్పాలని ఎల్వీ నిర్ణయించటమంటే చంద్రబాబు అధికారాలకు కత్తెర వేయటమనే చెప్పాలి.

 

క్యాబినెట్ సమావశం జరపాలని చంద్రబాబు పట్టుబడుతున్నదే ఉపాధి హామీ పథకంలో నిలిచిపోయిన రూ. 2 వేల కోట్ల బిలులను పాస్ చేయించుకోవటం కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ఆగిపోయిన బిల్లులు గనుక రాకపోతే రేపు వచ్చే ప్రభుత్వం వాటిని నిలిపేస్తే కష్టమని చంద్రబాబుపై టిడిపి నేతలు ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. పైగా నిలిచిపోయిన బిల్లులన్నీ పుత్రరత్నం నారా లోకేష్ ఆధ్వర్యంలోని పంచాయితీరాజ్ శాఖ పరిధిలోకే వస్తాయట.

 

నిజానికి క్యాబినెట్ సమావేశం జరపాలంటూ చంద్రబాబు ప్రతిపాదించిన నాలుగు అంశాల్లో ఏవి కూడా అంత ఇంపార్టెంటు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఫణితుపాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది. ప్రభావం ఉన్న రోజుల్లో కూడా ఎల్వీనే ప్రతిరోజు సమీక్షించేవారు. ఇక మంచినీటి ఎద్దడి గురించి, కరువు పరిస్దితులపైన కూడా చీఫ్ సెక్రటరీ సమీక్షలు చేస్తునే ఉన్నారు.

 

ఇక మిగిలింది ఉపాధి హామీ పథకం మాత్రమే. ఈ పనులను ప్రత్యేకంగా ఎవరు కూడా సమీక్షించేదేమీ ఉండదు. ఇపుడు సమస్యంతా నిలిచిపోయిన నిధుల విషయంలోనే. ఆర్ధిక అంశాలపై ఎటూ నిర్ణయం తీసుకునేందుకు లేదు. కాబట్టే క్యాబినెట్ అత్యవసర సమావేశం ఏమీ అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు పట్టుబడుతున్నారు కాబట్టే ఎన్నికల కమీషన్ అనుమతికి పంపాలని సిఎస్ నిర్ణయించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: