తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం కల్పించలేదని తెలుగుదేశం నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కాన్వాయ్​లో మార్పులు చేయాలంటే...ఎస్​ఆర్టీలో సమీక్ష జరిపి.. నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఎస్కార్ట్​ వాహనాన్ని తప్పించారని తెదేపా నేతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జడ్‌ప్లస్‌ భద్రతలో చంద్రబాబు ఉన్నందున ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌1, ఎస్కార్ట్‌2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ1, ఎన్‌ఎస్‌జీ2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్​లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు. సమీక్ష లేకుండా కొందరు అధికారుల అత్యుత్సాహంతోనే ఇది జరిగిందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన వాహనం మినహా మిగిలిన వాహనాలన్నింటినీ అసెంబ్లీ బయట పెట్టించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత జగన్‌ కాన్వాయ్‌కు అసెంబ్లీలో ఏ-2 నుంచి లోనికి అనుమతి ఉండేది. ప్రతిపక్షనేత వాహనాలను మంత్రుల వాహనాలతో సమానంగా పార్క్‌చేసుకునే అవకాశం ఉండేది.

అయితే చంద్రబాబుకు అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం తెదేపా వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా తగిన గౌరవం చంద్రబాబుకు ఉండేది.  మునుపెన్నడూ ఇలా లేదనే భావన తెదేపా వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: