ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వచ్చే నెల 5న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి 23 వరకు సీతారామన్ ముందస్తు బడ్జెట్ సంప్రదింపులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీలు బడ్జెట్ కోసం తమ విలువైన సలహాలు, సూచనలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ పూర్తి స్థాయి బ‌డ్జెట్‌పై అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. వివిధ వ‌ర్గాలు త‌మ ఆస‌క్తిని, అవ‌స‌రాల‌ను వెలిబుచ్చుకుంటున్నాయి. అంద‌రికంటే ముఖ్యంగా..సామాన్యుడి ఆకాంక్షపై స‌హ‌జంగానే దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ఇంత‌కీ సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడంటే..ప‌న్ను భారం త‌గ్గించాల‌ని!!



బడ్జెట్‌లో కేంద్రం సామాన్యులకు పన్నుల భారం తగ్గించే నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను రద్దు చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. మ్యాట్ రద్దుతో వినియోగం పెరిగి సంస్థలకు లాభం చేకూరగలదని చెబుతున్నారు. వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నది. దీనివల్ల చాలామంది వేతన జీవులకు గొప్ప ఊరట లభించగలదని అసోచామ్ చెబుతున్నది. అలాగే ప్రామాణిక కోత రూ.లక్షకు మించి ఉండకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 


సోమవారం నుంచి నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నం అయ్యారు. ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బంది.. బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 26 వరకు 17వ లోక్‌సభ తొలి సెషన్ జరుగనున్నది. ఇక వచ్చే నెల 4న ఆర్థిక సర్వే విడుదల కానుంది.  ఇదిలావుంటే ఈ నెల 20న జరిగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం సందర్భంగా ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులూ బడ్జెట్ కోసం తగు సూచనలు చేసే వీలున్నది. సీతారామన్ బడ్జెట్ బృందంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్, ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌లున్నారు. ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ నేతృత్వంలోని ఈ అధికారిక బృందంలో వ్యయ కార్యదర్శి గిరీష్ చంద్ర ముర్ము, రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, దీపం కార్యదర్శి అటాను చక్రబర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: