కేంద్రం లో త్వరలో నే  పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి కేంద్రం  నిధుల వరద పారనుందని ఆశిస్తోంది. బడ్జెట్ లో రాష్ట్రానికి ఈసారి మెరుగ్గా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. గత చంద్రబాబు సర్కార్ కేంద్రం తో ప్రతి విషయం లో ఘర్షణాత్మక వైఖరి అవలంభించగా, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం తో అన్ని విషయాల్లోనూ సఖ్యతను కోరుకుంటోందని చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం తో సఖ్యతగా ఉండడం వల్ల  రాష్ట్రానికి కేంద్రం బకాయి ఉన్న పాత బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లిస్తుందని అంటున్నారు.


ఇందులో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో ఖర్చు భరించే పథకాల నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను  వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాసింత ఊపిరి పీల్చుకున్నట్లయిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మధ్యాహ్న భోజన పథకానికి , అంత్యోదయ పథకానికి బియ్యం సేకరణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 534 కోట్ల రూపాయలు విడుదల చేయగా, 708 .65 కోట్ల రూపాయలను ఉపాధి హామీ అమలుకు కేటాయించింది. దీనితో రాష్ట్రం లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ నిధులను విడుదల చేయడం పరిశీలిస్తే, రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.


 ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి గత ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు చెల్లించలేదని, అందుకే నిధుల విడుదల లో జాప్యం జరిగిందని బీజేపీ నేతలు పదే, పదే చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్రం లో నూతనంగా అధికారం లోకి వచ్చిన వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి అందజేస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులను కూడా కేంద్రం సత్వరమే చెల్లించే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: