టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గన్నవరం ఎయిర్ పోర్టులో అక్కడి సిబ్బంది తనిఖీలు చేయడంపై ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ  ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో తూర్పు , దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్,వెలగపూడి రామకృష్ణ లు అర్ధనగ్నప్రదర్శలతో నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి కనీస భద్రత కూడా కల్పించలేదని, ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఏదైన పరిణామం ఎదురైతు ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నించారు.జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కడైనా భద్రత కల్పించకుండా ఉన్న పరిస్ధితులు ఎమైనా ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకి తగిన భద్రత కల్పించాలని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

 

టీడీపీ నేత‌ల గ‌గ్గోలు ఇలా ఉండ‌గా...బాబు భ‌ద్ర‌త విష‌యంలో అస‌లు అంశాల‌ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వెల్ల‌డించారు. చంద్రబాబు ‘గన్నవరం’ ఎపిసోడ్ పై స్పందించిన ఈ సంస్థ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు స‌రైన చ‌ర్యేన‌ని పేర్కొంది. సీఎం, గవర్నర్లకు మాత్రమే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని కేంద్ర సంస్థ స్ప‌ష్టం చేసింది. ఎయిర్ పోర్టులో జెడ్ ప్లస్ వ్యక్తి, ఇతరులు సమానమేనని వెల్ల‌డించింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు మాత్రమే విమానాశ్రయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తెలిపింది. మాజీ ముఖ్యమంత్రులకు ఇలా డైరెక్ట్ ఎంట్రీ ఉండదని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో జడ్ ప్లస్ కేటగిరి వ్యక్తులు, సాధారణ ప్రయాణికుల మధ్య తేడా ఉండదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల్లో భద్రత అన్నది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధీనంలో ఉంటుందని చెప్పింది.

 

 

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్  ఏవియేషన్ లో జడ్ ప్లస్ కేటగిరి వర్తించదని, ఈ విషయాన్ని ఏపీడీ అధికారులే స్వయంగా చెప్పారన్నారు. తనిఖీ విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న అనవసరమైన హడావుడి మానుకోవాలని అన్నారు. కేంద్ర సంస్థ‌లు ఇంత స్ప‌ష్టంగా వివ‌ర‌ణ ఇస్తున్న‌ప్ప‌టికీ..టీడీపీ నేతలు గ‌గ్గోలు పెడుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: