ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. కనీసం ఈ దేశంలో పౌరులుగా కూడా గుర్తించలేని నియంత పాలనలో  2014లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఆనాటి మూగరోదన ఇంకా ఏరులైపారుతోంది. అయిదేళ్ళుగా కేంద్రం వద్ద కనీసం ఇదీ అన్యాయమని చెప్పే నాధుడు కూడా లేని దుస్థితి.  కానీ ఇపుడు ఒక ఓదార్పు లభించింది.


జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన వాదనలు సమర్ధంగా వినిపించారు. మోడీ ఎదురుగానే తన వాదన‌కు ఉన్న బలాన్ని,  అయిదు కోట్ల జన గళాన్ని ఒక్క తన గొంతులో వినిపించారు. మోడీ అంటే జగన్ కి భయం అన్న వారి కళ్ళు పచ్చబారేలా జగన్ ఏపీ అన్యాయంపై పెద్ద గొంతు చేసి మరీ వినిపించారు. హోదా తప్ప మాకేదీ అవసరం లేదని కచ్చితంగా చాటి చెప్పారు. అంటే దానర్ధం మీ  ప్యాకేజీలు, సర్దుబాట్లు మాకు అసలు అవసరం లేదని ఖండితంగా చెప్పేశారు.


మాకు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీయే సర్కార్ చెప్పింది. దాన్ని అప్పటి ప్రతిపక్ష బీజేపీ బలపరచింది. అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఇపుడు కాదు కూడదంటే ఏమైపోవాలి ఇదీ జగన్ ప్రశ్న. విడదీసిన తెలంగాణాకు ఎప్పటికీ ఏపీ సాటి గా లేదు. కను చూపు మేరలో ఆ ఆశ కూడా లేదు. అందువల్ల హోదా ఇవ్వాల్సిందే. అదే మా సంజీవి, అదే మా జీవన రేఖ.


ఇంతకంటే ఎవరు చక్కగా వాదన వినిపిస్తారు. ఇంతకంటే ఎవరు కేంద్రం ఎదురుగా నిలిచి గట్టిగా గళమెత్తుతారు. జగన్ ఒక్కడే అది చేయగలరు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని ఆధారసహితంగా జగన్ విన్నవించిన తీరు కేంద్ర పాలకులకు కనువిప్పు కావాలి. మొత్తానికి జగన్ ప్రత్యేక హోదా కోసం సీఎం హోదాలో సాగించిన పోరు చాలా గొప్పది. ఆంధ్రులకు స్వాంతన కలుగచేసేది.



మరింత సమాచారం తెలుసుకోండి: