ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో మావోయిస్టులు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసి ఉంచుతున్నారు. ఈ క్ర‌మంలోనే మావోయిస్టులు ఎప్పుడు ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఏజెన్సీలో ఉన్న ఎమ్మెల్యేల‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచుతోంది. ఏజెన్సీలో ఉన్న అన్ని రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీయే గెలుచుకుంది. ఇక గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లోనే విశాఖ జిల్లా అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును న‌క్స‌లైట్లు దారుణంగా కాల్చిచంపిన సంగ‌తి తెలిసిందే.


ఈ దాడిలో ఎమ్మెల్యే సర్వేశ్వ‌ర‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా మృతి చెందారు. ఇప్పుడు మావోలో వైసీపీ ఎమ్మెల్యేల‌ను కూడా టార్గెట్ చేస్తార‌న్న అనుమానాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారికి భ‌ద్ర‌త పెంచుతోంది. ఈ క్ర‌మంలోనే ఏజెన్సీలోని ఓ ఎమ్మెల్యేకు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు ఇప్ప‌టి వ‌ర‌కు సాధారణ ఎమ్మెల్యేగా 1+1 కేటిగిరిలో భద్రత కల్పిస్తున్నారు. 


అయితే ఇప్పుడు దీనిని తాజాగా సవరించారు. దీని ప్రకారం ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రులతో సమానంగా 2+2 భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడం, అందున ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, మావోయిస్టుల సంచారం ఉండడం కారణంగా ఈచర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాలు ఏపీలోని పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో విలీనం అయ్యాయి. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏజెన్సీ ప్రాంత‌మే ఎక్కువుగా ఉంది. అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా బాల‌రాజుకు భ‌ద్ర‌త పెంచిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: