రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సోమవారం విజయవాడకు రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లనున్నారు. విమానంలో మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్ విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.

2:30 గంటలకు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. అక్కడే భోజనం చేసి  సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్‌ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమం సోమవారంతో ముగియనుంది.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ పాల్గొంటారు. నరసింహన్‌ సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు. గేట్‌వే హోటల్‌లో బస చేస్తారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: