ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 2009లో తన తండ్రి మరియు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు జగన్. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేతగా అప్పటినుండి ప్రజల్లో మమేకమై తిరుగుతున్న జగన్, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత జరిగిన తొలి ఎన్నికలయిన 2014లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అప్పట్లో వారి పార్టీకి 67 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదా మాత్రమే లభించింది. ఇక ఆ తరువాత జగన్ ప్రజల్లోనే ఉంటూ సమకాలీన రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు అర్ధం చేసుకుంటూ ప్రజా సమస్యలపై తనవంతుగా పోరాడుతూనే వస్తున్నారు. ఇక ఇటీవల ఒక సంవత్సరం పాటు అయన చేసిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. ఇక ఆపై మొన్న జరిగిన 2019 ఎలక్షన్స్ లో వైసిపి పార్టీ ఏకంగా 151 ఎమ్యెల్యే స్థానాలు గెలుచుకుని అద్భుత విజయం సాధించింది. అనంతరం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. అయితే సీఎం అయిన దగ్గరినుండి జగన్ ఎప్పటికపుడు ముందుగా రాష్ట్రానికి అవసరం అయిన అన్ని కార్యకలాపాలపై గట్టిగా  జరిగింది. 

మొట్టమొదటిగా అయన సామజిక పెన్షన్లు రూ.2250 కి పెంచారు, అంతేకాక అంగన్వాడీ వర్కర్లకు రూ.10 వేలు జీతం చేసిన జగన్, కిడ్నీ వ్యాధితో బాధపడేవారికి రూ.10 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్యోగులకు ఏకంగా 27శాతం ఇంటెరిమ్ రిలీఫ్ ను అయన పెంచడం జరిగింది. ఇకపోతే ఎప్పటినుండో ఉద్యోగులు పోరాడుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని, అలానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుందని, దానికోసం కమిటీలను వేయడం జరిగిందని ప్రకటించారు. ఇక తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక విడతల వారిగీ మద్యాన్ని తగ్గించి మరియు మద్యనిషేధాన్ని అమలు చేస్తామని, పూర్తిగా తమ ఐదేళ్ల పాలన పూర్తి అయ్యే సమయానికి మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేయాలన్నదే తమ సంకల్పం అని అయన అన్నారు. ఇక గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి రేషన్ సరుకులు మరియు ప్రజా సంక్షేమ పథకాలు చేరేలా చేస్తాను అని అంటున్నారు. 

అయితే పైన చెప్పుకున్నవన్నిటిని బట్టి చూస్తుంటే, జగన్ చాలావరకు తన తండ్రి వైఎస్సాఆర్ గారి వలె ప్రజా సంక్షేమం మరియు ప్రజాపాలనకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది. నిజానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జగన్, రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో పనిచేసినప్పుడు, అసలు రాష్ట్రానికి ఏమేమి అవసరం, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని సమర్ధవంతంగా ఎలా తీర్చాలి అనే దానిపై సునిశితంగా పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఎన్నికల్లో గెలుపు తరువాత ప్రస్తుతం ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇక అంతేకాదు రాబోయే రోజుల్లో తాను సహా మంత్రులెవరూ కూడా నిద్రలేకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి పోరాడుతారని, ఇక ఎవరైనా మంత్రి అలక్ష్యం వహించడం లేదా లంచాలు అడగడం వంటివి చేస్తే వారి స్థానంలో వెనువెంటనే కొత్తవారిని తీసుకుంటాం అని జగన్ స్పష్టం చేసారు. అయితే ఇప్పుడు మొదలెట్టిన సీఎం జగన్ గారి పాలన ఇదే విధంగా మరొక ఐదేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగి సంక్షేమ పథకాలు ప్రక్కదారి పట్టకుండా ప్రజల వద్దకు చేరితే, మరొక్కసారి ఆయన పార్టీనే గెలిచి మళ్ళి ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: