అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టగా..ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు. రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం, నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్‌ను గెలిపించారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్‌ మంత్రివర్గంలో చోటు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వ నేతలు ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ చేపడతామని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు.

 

గవర్నర్‌ ప్రసంగం అంటే ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్‌ అని అందరికీ తెలిసిందేనని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సును ప్రతిబింబించేలా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని భావించామని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమంపై వివరాలు లేవని విమర్శించారు. పట్టిసీమ వృథా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్‌ చేయడం మానండని పేర్కొన్నారు. మోటార్లు ఆన్‌ చేయడం మానేస్తే రైతులకు ఎంత ఆగ్రహం వస్తుందో మీరే చూస్తారని అన్నారు.

 

పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపైనే కాదని.. ప్రయోజనాలపై కూడా మాట్లాడాలని నిలదీశారు. పోలవరం పనులను 70 శాతం పూర్తి చేశామని వివరించారు. మిగతా 30 శాతం పనులు త్వరగా పూర్తిచేయాలని తాము కోరుతున్నామన్నారు. మేం చేయాల్సిందంతా చేశామని.. ఓడిపోయామని బాధపడుతున్నామని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిందని.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: