సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు ఏ పార్టీలోకి వెళ్తారా అన్న‌ దానిపై పెద్ద హడావుడి చేశారు. లక్ష్మీనారాయణ ముందు నుంచి వైసీపి పట్ల అంత ఇంట్రెస్ట్ గా లేరు. ఆయన టిడిపిలోకి వెళ్తారని, బిజెపిలోకి వెళ్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే చివరిలో ఎవరు ఊహించని విధంగా జనసేన కండువా కప్పుకున్నారు. అంతకుముందే పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీ సీటును మరో వ్యక్తి ఇవ్వ‌గా... ఆ వ్యక్తి  వైసిపిలోకి జంప్ చేయడంతో అక్కడ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేశారు. ఎన్నికలకు ముందు విశాఖలో జనసేన గెలుస్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేశాయి. ఒక్కసారిగా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు భారీ హైప్ వచ్చేసింది. తీరా ఫలితాలు చూస్తే ఆయ‌న మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 


ల‌క్ష్మీనారాయ‌ణ ఓడినా 2.80 లక్షల ఓట్లు సాధించి ప‌రువు నిలుపుకున్నారు. ఎంపీగా ఓడిపోవడంతో పాటు మూడో స్థానంలో నిలవడంతో ఆయ‌న తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓడినా... వెంటనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి, విశాఖలో తనపై గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన ఆ తర్వాత మీడియా కంటపడటం మానేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ‌ రాజకీయరంగంలో తాను వేసిన తప్పటడుగు వల్లే తొలి ప్రయత్నంలోనే ఓడిపోయారు. ఇదే క్రమంలో జనసేన నుంచి ఏకంగా రెండు చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడంతో జనసేన ఫ్యూచర్‌పై జేడికి ఓ క్లారిటీ వచ్చేసినట్లుంది. 


ఈ క్రమంలోనే ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజా సేవ చేస్తానని రాష్ట్రమంతటా తిరిగిన ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయాలు చెయ్య‌డం అంటే అంత సులువు కాద‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఎద‌గాలంటే జ‌న‌సేన లాంటి పార్టీల‌తో సాధ్యం కాద‌ని గ్ర‌హించిన ఆయ‌న ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపి కేంద్ర పెద్దలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏపీలో ఆయన కోరుకున్న లోక్‌స‌భ సీటు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. 


బిజెపి ఈ ఎన్నికల్లో గెలవాలని డిసైడ్ అయిన ఆయన అటు ఇటు తిరిగి చివరకు మునిగిపోయే నావ అయిన‌ జనసేనలోకి దూకారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారట. ఏపీ బిజెపి ఇప్పటికే కలగూరగంపగా ఉంది. లక్ష్మీనారాయణ చేరినా ఆయన ఎక్కడో చివరి వరుసలో ఉండాల్సిందే. ఏదేమైనా జనసేనలో కాస్తో కూస్తో పేరు ఉన్న లక్ష్మీనారాయణ లాంటివాళ్ళు కూడా  బయటకు వచ్చేస్తే ఆ పార్టీనీ పని ఖేల్ ఖ‌తం కావడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: