భార‌తీయ జ‌న‌తాపార్టీలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ కేంద్ర మంత్రి జె పి నడ్డా నియమితులయ్యారు. ఆయన ఆర్నెల్ల పాటు ఈ పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. హోం మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు.59 ఏళ్ల నడ్డా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో అద్భుతమైన వ్యూహనిపుణుడిగా నడ్డాకు మంచి పేరుంది. మొదటిసారి మోడీ ప్రభుత్వం ఏర్పడినపుడు జెపి నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కానీ అప్పుడు అమిత్ షాను బీజేపీ జాతీయాధ్యక్షుడిని చేశారు. మొదటి మోడీ సర్కారులో నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రిగా పని చేశారు.

 

 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించింది. సొంతంగా 300 సీట్ల మైలురాయిని దాటింది. ఈ ఘనత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు, ప్రణాళికలదేనని పార్టీ భావిస్తోంది. అమిత్ షా మోడీ కేబినెట్ లో చేరిన తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. హోమ్ శాఖ మంత్రి అయిన తర్వాత షాకు రెండు బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారినట్టు చెబుతున్నారు. మ‌రోవైపు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసింది. కానీ పార్టీ ఎన్నికలయ్యే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది. బీజేపీ నియమ నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుడు మరో మూడేళ్లు తన పదవిలో కొనసాగవచ్చు. సంస్థాగత ఎన్నికలయ్యే వరకు షా తన పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అమిత్ షా నేతృత్వంలోనే పోటీ చేస్తుందని తెలుస్తోంది. 

 

 

ఇదిలాఉండ‌గా, బిజెపి పార్లమెంటరీ పార్టీ బోర్డు  నేడు బిజెపి కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డాను ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ  తెలంగాణ‌ రాష్ట్ర శాఖ హర్షాన్ని,శుభాభినందనలు తెలియ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా జగత్ ప్రకాష్ నడ్డా పూర్తి సమయాన్ని కేటాయించి పని చేశారని ఆయ‌న కొనియాడారు. న‌డ్డా మార్గదర్శకత్వంలో తెలంగాణ రానున్న రోజుల్లో బలోపేతమవుతుందని, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎద‌గనుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. న‌డ్డా నాయకత్వంలో వారి కార్యదక్షతతో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో బలోపేతమవుతుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర పార్టీ తరపున వారికి శుభాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ బలోపేతం అవుతుందని రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంద‌న్న‌ నమ్మకం ఉంద‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: