విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌ శర్మ సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా సన్యాస దీక్షా నామకరణం చేశారు. మూడు రోజులు సాగిన దీక్షా స్వీకరణ మహోత్సవం ముగింపు సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గెలుపు త‌న‌కు ముందే తెలుస‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 


శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో శిష్య స్వీకార దీక్ష క్రతువు నిర్వహించారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసం స్వీకరించారు. బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మకు స్వరూపానందస్వామి యోగపట్టం అందించారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణలో సీఎంలు కేసీఆర్, జగన్‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం అప్పుడే చెప్పిందని, అందుకు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని తెలిపారు. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి కేసీఆర్‌ అని.. యాదాద్రి ఆలయాన్ని, వేములవాడ ఆలయాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసిచారు. దేవాలయాల పరిరక్షణ కోసం పరితపించిన వైఎస్‌ జగన్‌ తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి అని, ఆయన అంటే తనకు పరమప్రాణమని పేర్కొన్నారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం తపస్సు చేస్తుందని చెప్పారు.


శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని నియమిస్తున్న సంగతి నాలుగేళ్ళ క్రితమే వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తాను చెప్పానని తెలిపారు.శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశామని.. తన పేరులోని స్వరూప అన్నా, స్వాత్మ అన్న ఒక్కటే అయినందువల్ల తాము అద్వైత స్వరూపులమని ఆయన వివరించారు. ఈ విషయం తెలిసి కేసీఆర్‌ కూడా రాజశ్యామల యాగం సందర్భంగా బాలస్వామిని ఘనంగా సత్కరించి పంపారని చెప్పారు. రాజశ్యామల మాత సాక్షిగా 2024 నాటికి పీఠం బాధ్యతలను పూర్తిగా స్వాత్మానంద్రేంద్ర సరస్వతికి అప్పగించనున్నట్టు స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఆ తరువాత తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేయనున్నట్టు తెలిపారు. కశ్మీర్‌ నుంచి లడఖ్‌ వరకు పాదయాత్ర చేసి స్వాత్మానందేంద్ర సరస్వతి  అక్కడ తపస్సు చేశారని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం స్వాత్మానందేంద్ర సరస్వతీ రూపంలో ఈ లోకానికి ఆధ్యాత్మిక శక్తిని అందించిదని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: