ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అమరావతిపై గొప్పలు చెప్పే నేతలు ఆ ప్రాంతంలోని రెండు సీట్లలో ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడల వల్లే టీడీపీ ఓడిపోయిందని విమర్శించారు.

 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే, దానికి విరుద్ధంగా చంద్రబాబు ఆ పార్టీతో కలిశారని, రాహుల్‌ను ప్రధాని చేయాలని చూశారని మంత్రి దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని చెప్పిన చంద్రబాబు, ఈ ఎన్నికల నాటికి బీజేపీ భూస్థాపితం చేసి ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చినా ప్రజలు తిప్పికొట్టారని అవంతి పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఏ సూచన చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

 

ఎన్నికలకు ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వ్యక్తినని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ స్థానంలో చంద్రబాబు ఉంటే, ఉన్న 23 ఎమ్మెల్యేలను 13కు ఎలా చేర్చాలా అని ఆలోచనలు చేసుండేవారని ధ్వజమెత్తారు.

 

నవరత్నాలను కాపీ కొట్టాలని ప్రయత్నించడం వల్లే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తమ ప్రభుత్వం ప్రజల ముందు బయటపెడుతుందని అవంతి పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించే కమిటీ పోలవరంలో జరిగిన అవకతవకలు, అవినీతిని వెలుగులోకి తెస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలూ అభద్రతా భావానికి లోనయ్యారని, అందువల్లే అఖండ మెజారిటీతో తమ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: