రాజ‌కీయాల్లో ఓర్పు, స‌హ‌నం, ఓపిక ఈ మూడు చాలా ముఖ్యం అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ఈ మూడింటితోనే పైకి వ‌చ్చిన వారు ఉన్నారు. ఈమూడు కోల్పోయి.. రాజ‌కీయంగా స‌మాధి ఏర్పాటు చేసుకున్న నాయ‌కులు కూడా ఉన్నారు. ఈ రెండో కోవ‌కు చెందిన వారు గా మిగిలిపోయారు క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గౌరు దంప‌తులు. గౌరు దంపతుల‌కు వైఎస్ ఫ్యామిలీతో చ‌క్క‌ని సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌తో వారికి అనుబంధం కూడా ఉంది. 


ఆయ‌న పార్టీ అధికారంలోకి రాక‌ముందు, ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌స‌మ‌యంలోను, ఆయ‌న జైలుకు వెళ్లిన స‌మ‌యంలోనూ ఈ దంప‌తులు జ‌గ‌న్ ఫ్యామిలీకి అండ‌గా నిలిచారు. 2014 ఎన్నిక‌ల్లో పాణ్యం నుంచి గౌరు చ‌రితా రెడ్డి వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ప్ర‌తిప‌క్షానికే ఆమె ప‌రిమిత‌మ‌య్యారు. అయినా కూడా వైసీపీకి సేవ‌చేశారు. పార్టీని బ‌లోపేతం చేశారు. ఎన్ని విధాలా అధికార టీడీపీ నుంచి ఒత్తిడులు వ‌చ్చినా పార్టీలోనే కొన‌సాగారు. 


అయితే, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి .. పాణ్యం టికెట్ విష‌యంపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చ‌రితా రెడ్డికి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. పాణ్యంలో పార్టీ టికెట్‌ను త‌మ‌కు కాకుండా వేరేవారికి ఎలా ఇస్తారంటూ.. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందుగానే ఈ దంప‌తులు రోడ్డెక్కారు. అయితే, పార్టీపై ధిక్కార స్వ‌రం మాత్రం వినిపించ‌లేదు. పోరాడి సాధించుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, వీరి టికెట్ యావ ను గ‌మ‌నించినటీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ వీక్‌నెస్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. త‌మ పార్టీలోకి వ‌స్తే.. టికెట్ ఇస్తామ‌ని, ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెడ‌తామ‌ని ఆశ చూపించారు. 


దీంతో చంద్ర‌బాబు మాట‌ల వ‌ల‌లో చిక్కుకున్న ఈ దంప‌తులు ఓ ఫైన్ డే పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఎన్నిక‌ల్లో టికెట్ సంపాయించుకున్నారు. కానీ, జ‌గ‌న్ సునామీలో టీడీపీ కొట్టుకు పోవ‌డంతో ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన చ‌రితా రెడ్డి కూడా అడ్ర‌స్ లేకుండా పోయారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో వీరిని ప‌ట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. సో.. జ‌గ‌న్‌ను ఏదో సాధించాల‌ని నిర్ణ‌యించుకున్న గౌరు దంప‌తులు చేతులు కాల్చుకుని కూర్చున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అదే పార్టీలో ఉండి ఉంటే.. క‌నీసం టికెట్ ల‌భించ‌క పోయినా.. గుర్తింపు, గౌరవం, సింప‌తీ అయినా ద‌క్కి ఉండేవ‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: