కొత్త‌ప‌ల్లి గీత ఈమె పేరు గ‌త నాలుగైదేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో బాగానే వినిపించింది. ఐదేళ్ల రాజ‌కీయ జీవితంలోనే గీత అన్ని పొలిటిక‌ల్ యాంగిల్స్ చూసేశారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో అర‌కు నుంచి వైసీపీ ఎంపీగా ఏకంగా ల‌క్ష ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించిన ఆమె ఆ త‌ర్వాత ఆ పార్టీలో ఇమ‌డ లేక‌పోయారు. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయ అస్థిర‌త్వంతోనే ఆమె చాలా త‌ప్ప‌ట‌డుగులు వేసేశారు. మారిన పార్టీలోనూ ఇమడలేక.. పాత పార్టీకి వెళ్లలేక చివ‌ర‌కు కొత్త పార్టీ పెట్టుకున్నారు. చివ‌ర‌కు ఇప్పుడు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసేసి ఆమె కూడా కాషాయ కండువా క‌ప్పేసుకున్నారు.


ఇక అస‌లు మేట‌ర్‌లోకి వెళితే అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆమెకు కాషాయ కండువా క‌ప్పేశారు. తాను స్థాపించిన జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా గీతను పార్టీలోకి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.


2014 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వ అధికారిగా ఉన్న ఆమె త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి అర‌కు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. అక్క‌డ కూడా ఇమ‌డ‌లేక బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌కు ముందు కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అస‌లే విశాఖ నుంచి ఈ ఎన్నిక‌ల్లో మ‌హామ‌హులు త‌ల‌ప‌డ్డారు. వీరిలో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి గెల‌వ‌గా మిగిలిన వారు తునాతున‌క‌లు అయ్యారు. ఈ లిస్టులో గీత కూడా చేరిపోయారు.


ఇక గీత ఒక్క‌సారే ఎంపీగా గెలిచినా ఆమె వైసీపీకి దూర‌మ‌య్యాక ముందు నుంచి తెలివిగా బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉంటూ వ‌చ్చారు. అరుణ్‌జైట్లీ, సుష్మాస్వ‌రాజ్‌తో పాటు రామ్‌మాధ‌వ్ వంటి నేత‌ల ద‌గ్గ‌ర ఆమెకు కాస్త గుర్తింపే ఉంద‌ట‌. అందుకే ఆమె బీజేపీలో చాలా సులువుగా చేరిపోయారు. ప్ర‌స్తుతం ఏపీపై బీజేపీ ప్ర‌ధానంగా కాన్‌సంట్రేష‌న్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఓ మాజీ గిరిజ‌న ఎంపీగా గీత లాంటి వాళ్ల అవ‌స‌రం వాళ్ల‌కు కూడా ఉంది. అందుకే ఆమెను పార్టీలో చేర్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: