రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరందిస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయమవుతోంది. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేదంటే ఏపీ, తెలంగాణ రెండింటికీనా?  ఏపీ సీఎం జగన్ అధికారానికి కొత్త కావడం.. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లుగా పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో కాస్త సయోధ్యగా ఉంటుండడంతో దాన్ని కేసీఆర్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.

 

తెలంగాణ మంత్రిమండలి సమావేశం తరువాత కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికీ నీరందిస్తామని చెప్పారు. వినడానికి ఇది బాగానే ఉన్నా కేసీఆర్ ఈ హామీ ఇచ్చేటప్పటికి ఆయన పక్కన ఏపీ సీఎం లేరు. అంటే... ఏపీ సీఎం జగన్ తరఫున కూడా కేసీఆరే హామీలు ఇస్తున్నారన్నమాట.

 

ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిపై చర్చించుకుని ఉండొచ్చు.. ప్రణాళికలు రూపొందించుకుని ఉండొచ్చు... ఎగువన ఉన్న తెలంగాణ ఈ విషయంలో సహకారం అందించేందుకు పెద్ద మనసు చేసుకునీ ఉండొచ్చు.. కానీ, కేసీఆర్ ఇలా జగన్ లేకుండా దీనిపై హామీ ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

 

కేసీఆర్ చెప్పిందేమీ ఏపీకి నష్టం కలిగించేది కాదు.. పైగా మేలు చేసేది కూడా. మంచి విషయమే అయినప్పటికీ ఏపీకి ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, నీటిపారుదలకు సంబంధించి ఒక మంత్రి.. అధికారులు ఉన్నారు. కానీ, వారెవరితో సంబంధం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ హామీ ఇవ్వడం జగన్‌ను కేసీఆర్ డామినేట్ చేయడమేనంటున్నారు కొందరు ప్రభుద్దులు.


మరింత సమాచారం తెలుసుకోండి: