విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుపై పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పార్టీలోని రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తిరుగుబాటు లేవదీశారు. రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలంటూ రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ అంద చేయనున్నారు. వీరిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తాన్ని, బిజెపిలో చేర్చుకునే బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాపై పడింది.

 

రాజ్యసభలో టిడిపికి ఆరుమంది సభ్యులున్నారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్ర, గరికపాటి రామ్మోహన్ రావుల్లో సీతా రామలక్ష్మి, రవీంద్ర తప్ప మిగిలిన నలుగురు వేరే గ్రూపుగా ఏర్పడ్డారు. వీరిప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా లు చర్చలు పూర్తి చేశారు.

 

ప్రస్తుతానికి నలుగురు రాజ్యసభ సభ్యులే ప్రత్యేక గ్రూపుగా ఏర్పడుతున్నా తొందరలోనే సీతా రామలక్ష్మి కూడా చేరుతుందని సమాచారం.  ప్రత్యేక గ్రూపుగా ఏర్పడిన వీరు నలుగురు శుక్రవారం నాడు వెంకయ్యనాయుడును కలిసి తమను బిజెపి అనుబంధ సభ్యులుగా పరిగణించాలని కోరుతు  ఓ లేఖ అందివ్వనున్నట్లు తెలుస్తోంది.

 

మొత్తానికి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరగానే పార్టీలో తిరుగుబాటు మొదలవ్వటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తినగానే చంద్రబాబు నాయకత్వంపై అందరిలోను అనుమానాలు బయలుదేరాయి. అదే సమయంలో లోకేష్ సమర్ధతపై ఎవరికి నమ్మకం లేకపోవటంతోనే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చాలామంది చూపు బిజెపి వైపు మళ్ళింది.

 

రాజ్యసభలో బిజెపికి కూడా సరైన బలం లేదు. దాని బలం పెంచుకునే ఉద్దేశ్యంతో ఇతర పార్టీల్లోని ఎంపిలకు గేట్లను బార్లా తెరిచింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులను గోకుతున్న బిజెపి తొందరలో విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నానిపైన కూడా గురిపెట్టినట్లు సమాచారం. బహుశా ఈనెలాఖరులో ఆ ముచ్చట కూడా తీరిపోతుందేమో.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: