నిజ‌మే! నిన్న మొన్న‌టి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు.. మోడీతో పెట్టుకుని స‌ర్వ‌నాశనం అయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిజం కూడా అవుతున్నాయి. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓట‌మిపాలైంది. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లోనూ బ‌లం లేకుండా పోయింది. ఇప్ప‌టి వ‌రకు ఆరుగురు ఉన్న రాజ్య‌స‌భ సభ్యుల సంఖ్య ఒక్క‌సారిగా రెండుకు ప‌డిపోయింది. ఇక‌, అసెంబ్లీలో న‌లుగురు చేజారితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా క‌ష్ట‌మే! మ‌రి ఇలాంటి ప‌రిస్థితికి ఎందుకు పార్టీ దిగ‌జారిపోయింద‌నే విష‌యం క‌న్నా కూడా ఇప్పుడు పార్టీని ఏవిధంగా బ‌లోపేతం చేసుకోవాల‌నే విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది. 


ప్ర‌స్తుతం టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు ఉన్నారు. అదేవిధంగా ఏపీ అధ్య‌క్షుడిగా క‌ళా వెంక‌ట్రావు ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో బాబు గెలిచినా. క‌ళా మాత్రం ఓడిపోయారు. అదేవిధంగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న బాబు కుమారుడు లోకేష్ కూడా ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లోపార్టీకి జ‌వ‌స‌త్వాలు ఎలా నింపాలి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రో నెల రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌లేవ‌బోతోంది. గ‌త 2014 ఎన్నిక‌ల‌కు ముందు భారీ ఎత్తున స్థానిక సంస్థ‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉంటుందా? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 


అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో పార్టీ అధినాయ‌క‌త్వం మారాల‌నే మాట కొంచెం గ‌ట్టిగానే వినిపిస్తోంది. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి ఎండ్ కార్డ్ ప‌డింద‌ని నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోప‌క్క‌, జ‌న‌సేనను యువ‌నాయ‌కుడు ప‌వ‌న్‌, వైసీపిని యువ సీఎం జ‌గ‌న్ న‌డిపిస్తున్న‌ప్పుడు టీడీపీకి ఇంకా ముస‌లి(త‌మ్ముళ్లు బాధ‌ప‌డినా.. బాహాటంగా వినిపిస్తున్న మాట ఇదే. ఎన్నిక‌ల స‌మ‌యంలో మెజారిటీ ప్ర‌జ‌లు కూడా బాబుకు ఇక రెస్టిద్దాం అనే మాట‌ను వినిపించారు) నాయ‌కుడేనా అనే మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో యువ నాయ‌క‌త్వాన్ని కోరుతున్నారు. అయితే, పార్టీలో ఎవ‌రున్నారు? ఒక్క చంద్ర‌బాబు త‌న‌యుడు త‌ప్ప‌!


అయితే, త‌న నియోజ‌క‌వ‌ర్గం పేరును తానే చెప్పుకోలేని లోకేష్‌పై ప్ర‌జ‌ల్లోనే కాదు.. పార్టీ నేత‌ల్లోనూ వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. బాబులాంటి ఉద్ధండుడు న‌డిపిస్తేనే పార్టీ ఇలా ఉంటే.. ఎలాంటి వ్యూహం లేని లోకేష్ తెర‌మీదికి వ‌స్తే.. ప‌రిస్థితి ఏంటి? అనేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దాదాపు ఎవ‌రూ కూడా పార్టీలోని నాయ‌కులు లోకేష్ పేరును ప్ర‌స్థావించ‌డం లేదు. అప్ప‌ట్లో 2018లో జ‌రిగిన మ‌హానాడులో అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి లోకేష్ సీఎం అయితే.. త‌ప్పేంటి? అని బ‌హిరంగ‌వేదిక‌గానే ప్ర‌శ్నించారు. అయితే.. ఇదంతా రాజ‌కీయంగా త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ‌. ఇదే మ‌నిషి ఇప్పుడు అదే లోకేష్‌ను న‌ర్మ‌గ‌ర్భంగా ఎత్తిపొడుస్తున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిని త‌ట్టుకుని చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: