తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు షాకిస్తూ...టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాని మోడీ కేబినెట్ లో తాను పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇటీవల ఎన్నికల్లో జాతి అంతా బీజేపీ వైపే ఉందని తేలిందని.. అప్పుడే తామంతా బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నామని తెలిపారు.  అయితే, అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా గురించి సుజ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


దేశాభివృద్ధికి నరేంద్ర మోడీయే సరైన నాయకుడని నమ్ముతున్నానని సుజ‌నా చౌద‌రి అన్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే అంశాల కోసం పాటుపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే అక్కడ క్రమశిక్షణ కలిగిన ఓ సైనికుడిలా పనిచేశానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తనతో పాటు మరో ముగ్గురు కూడా బీజేపీలో చేరారన్నారు. జాతి నిర్మాణం కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సుజనా స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని అభిప్రాయపడుతున్నట్టు ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. తమ చేరికతో ఏపీ విభజన చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానన్నారు.  `ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడింది. ఏపీకి ప్యాకేజీ కోసం తానూ పాటు పడ్డాను. ఆంధ్రప్రదేశ్‌కు ఏది మంచిదో దానికోసం కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ` అని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ గురించి సుజ‌నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `చంద్రబాబు ఎప్పటికీ తనకు రాజకీయ గురువే. రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిందే ఆయన. 2004 నుంచి తాను పార్టీలోనే ఉన్నా, కష్టకాలంలోనూ కొనసాగాను. పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంత కష్టపడ్డానో చంద్రబాబుకు తెలుసు. ఏపీలో టీడీపీ నిలదొక్కుకోవాలని ఆకాంక్షించే తొలి వరుస వ్యక్తుల్లో నేను ఒకరిని`అని అన్నారు. `నాపై ఎలాంటి ఫిర్యాదు, ఛార్జిషీటూ లేదు. ఇటీవల వచ్చినవి కూడా అభియోగాలు మాత్రమే. రాజ్యాంగం ప్రకారం అనుమానం వస్తే ఎవరినైనా విచారించవచ్చు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. 2004లోనే నేను వ్యాపారం నుంచి బయటకు వచ్చాను. వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. ' అని సుజనా చౌదరి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: