తెలంగాణ‌లో దాదాపు ఎన్నిక‌ల లొల్లి అయిపోయింది. అసెంబ్లీ ఎన్నిక‌లు మొద‌లు.. మొన్న‌టి ప్రాదేశిక ఎన్నిక‌ల దాకా.. దాదాపుగా ఆరేడు నెల‌ల కాలం గ‌డిచిపోయింది. ఈనెల 21సీఎం కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు కాళ్వేశ్వ‌రం ప్రారంభోత్స‌వం కూడా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇప్పుడికి సీఎం కేసీఆర్ దృష్టి అంతా కూడా పాల‌న‌పై ఉండ‌బోతోంది. అయితే.. ఇక్క‌డే ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం తెర‌పైకి వ‌స్తోంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కొద్దిమందితోనే మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. 


ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డుతారా?  మార్పులు ఏమైనా చేస్తారా..?  కొత్త‌వారికి అవ‌కాశం ఉంటుందా..? అందులో మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌కు చోటు ద‌క్కుతుందా..?  అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మువుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో హ‌రీశ్‌, కేటీఆర్ ఇద్ద‌రు కూడా కీల‌క శాఖ‌ల్లో మంత్రులుగా ప‌నిచేశారు. ఇక హ‌రీశ్‌రావు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు చుట్టూనే ప‌ర్య‌టించారు. రాత్రింబ‌వ‌ళ్లు అక్క‌డే ఉండి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. కానీ.. మొన్న జ‌రిగిన ప్రారంభోత్స‌వానికి మాత్రం ఆయ‌న‌కు ఆహ్వానం లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌తోపాటు పార్టీవ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఇదే స‌మ‌యంలో హ‌రీశ్‌రావు బీజేపీలోకి వెళ్తున్నార‌నే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే క‌మ‌లం జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో ఆయ‌నకు అవ‌గాహ‌న కుదిరింద‌నే వార్త‌లు ఏకంగా జాతీయ మీడియాలోనూ వ‌స్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మంత్రివ‌ర్గంలో హ‌రీశ్‌కు చోటు ద‌క్కుతుందా..? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి.. చాలా కాలంగా ఆప్ర‌చారాన్ని ప‌లుమార్లు హ‌రీశ్ ఖండిస్తూనే వ‌స్తున్నారు. పార్టీలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేస్తూనే ఉన్నారు. అయినా.. పార్టీలోగానీ.. ప్ర‌భుత్వంలోగానీ.. సీఎం కేసీఆర్ ఆయ‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు.


ఒక‌వేళ ఇప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డితే.. అందులో హ‌రీశ్‌కు స్థానం కల్పిస్తారా..?  లేదా..? అన్న‌ది పార్టీవ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌క‌పోతే.. సీఎం కేసీఆర్ పై ప్ర‌జ‌ల్లో, ఆయ‌న అభిమానుల్లో మ‌రింత వ్య‌తిరేక‌త వ్యక్త‌మ‌వుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డాలంటే.. మ‌రికొంత కాలం ఆగాల్సిందే మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: