రాజ‌కీయంగా ఇప్ప‌టికే ఎన్నో రాంగ్‌స్టెప్పులు వేసి తీవ్రంగా న‌ష్ట‌పోయాడు మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌. తండ్రి వంగ‌వీటి మోహ‌న‌రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధా ఆ త‌ర్వాత రాజ‌కీయంగా చేసిన త‌ప్పిదాల‌తో కెరీర్ ప‌రంగా పూర్తిగా డైల‌మాలో ప‌డిపోయారు. అస‌లు రాధాకు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉన్న‌ట్టు కూడా క‌న‌ప‌డ‌డం లేదు. 


2004లో త‌క్కువ వ‌య‌స్సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వైఎస్ ద‌య‌తో ఎమ్మెల్యే అయిన ఆయ‌న ఆ త‌ర్వాత 2009లో వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా విన‌కుండా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత రాధా రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేరు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీడీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు.


ఇక తాజాగా ఆయ‌న ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. నిన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో స‌మావేశం అయిన రాధా వ‌రుస‌గా రెండో రోజు కూడా స‌మావేశం అవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిన్న విజయవాడ పటమటలోని పవన్ నివాసానికి వచ్చి, దాదాపు గంట పాటు మంతనాలు సాగించిన రాధా... ఈ రోజు ఉద‌యం కూడా స‌మావేశం అవ్వ‌డంతో ఆయ‌న జ‌న‌సేన ఎంట్రీకి ఖ‌రారైంద‌ని తెలుస్తోంది.


అస‌లు ఎన్నిక‌ల‌కు ముందే రాధా జ‌నసేన‌లో చేర‌తార‌ని అనుకున్నా... ఆయ‌న అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని తేలిపోవ‌డంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ట‌. టీడీపీలో ఉండ‌లేరు... వైసీపీలోకి వెళ్లలేరు... బీజేపీలోకి ఇష్టం లేద‌ట‌. దీంతో ఇప్పుడు రాధా మ‌ళ్లీ సామాజిక లెక్క‌లు వేసుకుని జ‌న‌సేన‌లోకే వెళ్లిపోతున్నార‌ట‌.


ఈ రోజు ఉద‌యం రాధా - ప‌వ‌న్ భేటీలో వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రాధా, జనసేనలో చేరే అంశం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ట‌. వచ్చే నెల 4 లేదా 5వ తేదీల్లో పార్టీలో చేరికకు ముహూర్తం నిర్ణయించడం కూడా జరిగిపోయిందని జనసేన వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ప‌దిహేనేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉంటోన్న రాధా మ‌రో ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు ప‌రిమితం కాక‌త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: