"ఇతర పార్టీ నేతలు, ముఖ్యులు మాతో టచ్‌లో ఉన్నారు. లోపాయికారిగా మాట్లాడుతున్నారు. పార్టీలో చేరేందుకు వీరంతా తహ తహలాడుతున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు" కొంత కాలంగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలివి.  వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఇటీవలే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. పార్టీ పట్ల విధేయతను ప్రకటించారు. తెలుగుదేశం సైతం తనకు ప్రాధాన్యత ఇచ్చినా.. మారిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ పట్ల తాను ఆకర్షితుడైనట్టు ప్రకటించారు.

 

దీనికితోడు కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు, ముగ్గురు మాజీలు కమలం వైపు కదలడం ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం నేతలు బీజేపీలోకి రానురానంటూనే లోలోన కమలనాధులతో మంతనాలు జరుపుతున్నారా..? తాము ఉనికి కోల్పోకుండా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారా? పార్టీ అధినేత చంద్రబాబు పట్ల ఇష్టం ఉన్నా.. వ్యక్తిగత రాజకీయ ప్రభావంతో వేరే పార్టీ తలుపు తట్టబోతున్నారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

నిన్న మొన్నటి వరకు ఇదంతా బీజేపీ మైండ్‌ గేమ్‌లో భాగమేనని తెలుగుదేశం విశ్వసించింది. కాని అంబికా కృష్ణ పార్టీ వీడిన తరువాత పరిస్థితిపై మరింత అటెన్షన్‌కు గురవుతోంది. టీడీపీకి మొదటి నుంచి అత్యంత విధేయులుగా పేరొందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారంటూ విస్తృత ప్రచారం సాగుతోంది. పార్టీలో తగినంత కేడర్‌ను సమకూర్చుకుని ఇప్పటి వరకు సై అంటే సై అనే రీతిలో వ్యవహరించిన ఈ నేతలంతా బీజేపీలోకి వస్తే వారితో పాటు కేడర్‌ కదిలి వస్తుందని కమలనాధులు అంచనాకు వచ్చారు.

 

వచ్చే వారం జరగబోయే టీడీపీ సమన్వయ కమిటీలో వలసల వ్యవహారం తేలిపోనుంది. ఆనాటికి పార్టీని వీడి వెళ్ళే వారిపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక నేతలకు బీజేపీ గేలం వేసింది. పరిస్థితిని బట్టి వైసీపీ వైపు మొగ్గు చూపడానికి కొందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ సమన్వయ కమిటీ సమావేశంతో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: