మూడు కోతుల కథ గురించి మ‌నంద‌రికీ తెలిసిందే క‌దా?  చెడు విన‌కు..చెడు మాట్లాడ‌కు..చెడు చూడకు అని. దీన్ని స‌హ‌జంగా మ‌నం వివిధ సంద‌ర్భాల్లో వాడుతుంటాం. అయితే, దీనిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తాజాగా ఉప‌యోగించారు. మాట‌కారి, త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించ‌డంలో నేర్పరి అయిన మోదీజీ...ఈ క‌థ‌ను ఎవ‌రికి వినిపించారో తెలుసా? ప‌్ర‌వాస భార‌తీయుల‌కు! ఔను. జపాన్‌లోని ప్ర‌వాస భార‌తీయుల‌కు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వచ్చిన మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నందుకు వారికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. 


ప్రధాని నరేంద్రమోదీ కోబ్ నగరంలో భారత సంతతికి చెందిన ప్రజలతో మాట్లాడుతూ....భారత్-జపాన్ మధ్య సంబంధాలు ఎంతో బలమైనవని పేర్కొన్నారు. కార్ల తయారీ కోసం ఉభయ దేశాల మధ్య మొదలైన సహకారం నేడు బుల్లెట్ రైళ్లను ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నదని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాల పురాతనమైనవని గుర్తు చేశారు. ఒకరి సంస్కృతి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉందన్నారు. భారత జాతిపిత ప్రాచుర్యం లోకి తెచ్చిన మూడుకోతుల సిద్ధాంతం కూడా జపాన్‌కు సంబంధించినదేనని గర్తుచేశారు.  వచ్చే ఐదేళ్ల‌లో భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జపాన్‌తో భారత్ సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయని చెప్పారు. భారత్‌లో నేడు జపాన్ ముద్రలేని ప్రాజెక్టులు లేవని అన్నారు. భారతీయుల నైపుణ్యం, కార్మిక శక్తి జపాన్ బలోపేతం కావడానికి దోహదపడుతున్నాయని చెప్పారు. జపాన్‌తో భారత సంబంధాలు బలోపేతం కావడానికి స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ టాగోర్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, జస్టిస్ రాధాబినోద్ పాల్ తదితరులు కృషిచేశారని తెలిపారు.


జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని మోదీ గురువారం వివిధ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక స్థితి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల అప్పగింత, విపత్తు నిరోధక చర్యలు వంటి అంశాలు వారి చర్చల్లో చోటు చేసుకున్నాయి. వచ్చే అక్టోబర్‌లో జరుగనున్న జపాన్ చక్రవర్తి నారుహితో పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి కోవింద్ హాజరవుతారని ప్రధాని మోదీ చెప్పారు. జపాన్‌లో రెయివా శకం ప్రారంభమైన అనంతరం, మోదీ రెండోసారి ప్రధాని పదవిని చేపట్టిన తరువాత అబేతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు జపాన్‌కు వచ్చిన మోదీ అబేతో సమావేశమయ్యారు. జపాన్‌లో రెయివా శకం ప్రారంభం కావడం పట్ల మోదీ ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ప్రధానుల భేటీ వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వెల్లడించారు. పాత దోస్తులైన ఇద్దరు ప్రధానుల మధ్య సమావేశం ఎంతో ఆహ్లాదకరంగా జరిగిందని గోఖలే చెప్పారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు నిర్మాణాత్మకంగా సమగ్రంగా జరిగాయని తెలిపారు. జీ20 సదస్సు ద్వారా తాను ఆశిస్తున్న ఫలితాలను గూర్చి అబే మాట్లాడారని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గూర్చి చర్చించారని తెలిపారు. గతంలో జరిగిన జీ20 సమావేశాల్లో.. ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ఆర్థికనేరగాళ్ల అంశాన్ని మోదీ ప్రస్తావించారని గుర్తు చేసిన అబే.. అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా జీ20 నేతలు ఈ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరాన్ని అబే నొక్కి చెప్పారు. వాతావరణ మార్పులను అరికట్టే విషయమై కూడా జీ20 ఒక నిర్మాణాత్మక సందేశాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. 


ఇరువురు ప్రధానులు ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌పై కూడా చర్చించారని గోఖలే తెలిపారు. విపత్తు అనంతరం జరిగే పునర్నిర్మాణ పనుల్లో జపాన్ సహకారాన్ని ప్రధాని మోదీ కోరారని చెప్పారు. ఈ రంగంలో జపాన్‌కు అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రధాని వారి సహాయం కోరారని తెలిపారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దేశాల మధ్య సహకారాన్ని భారత్ కోరుతున్నది. తద్వారా విపత్తు సంభవించినప్పుడు సహాయం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో సదరు దేశానికి ఒక అవగాహన ఉంటుందన్నది మోదీ ఆలోచన అని గోఖలే వివరించారు. దేశాల మధ్య ఇటువంటి సహకారం ఐక్యరాజ్యసమితికి పోటీ కాదని చెప్పారు. కాగా కెన్యాలో భారత్, జపాన్ కలిసి క్యాన్సర్ దవాఖానను నిర్మించనున్నాయి. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులతో భేటీ కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: