జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ త‌న పార్టీ ప‌ట్ల మ‌రింత ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలవ‌డం, పార్టీ సైతం ఊహించ‌ని రీతిలో ఒక్క‌స్థానానికే ప‌రిమితం అయిపోయిన నేప‌థ్యంలో...పార్టీని గట్టెక్కించేందుకు పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని పవన్ భావిస్తున్నారట. ఈ నేప‌థ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన జనసేనాని ఈ ఓట‌మి నుంచి  తేరుకొని రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూనే, పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి సారించారు. ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను, నాయకులను సమన్వయం చేసేందుకు త‌న సోదరుడు నాగబాబుకు పవన్ కొత్త బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. 



ఏపీలో ఉత్కంఠ‌భ‌రితంగా ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలోనే జనసేనలో చేరిన నాగబాబు నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితమయ్యారు. పవన్ కల్యాణ్ భీమవరంలో, నాగబాబు నరసాపురంలో ఓడిపోవడం జనసేన శ్రేణులను తీవ్ర నిరాశపర్చింది. పవన్, నాగబాబు ఇద్దరూ సొంత జిల్లాలో పోటీ చేసినప్పటికీ గట్టెక్కలేకపోయారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని నాగబాబు ఎన్నికల సమయంలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నాయకులకు, కార్యకర్తలకు మధ్య నాగబాబును వారధిగా ఉంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
పార్టీలో సమన్వయం లేకపోవడం కూడా పార్టీ ఘోర ఓటమికి ఓ కారణమనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకే జనసేనలో మార్పులకు పవన్ శ్రీకారం చుడుతున్నారు. అధినేత సోదరునికి కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంచాలని డిసైడ్ అయ్యారట. అధికారిక ప్రకటనే తరువాయి అని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ అమెరికా పర్యటన నుంచి వ‌చ్చిన త‌ర్వాత నాగబాబుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: