ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఇప్పుడు పద‌వుల పంపిణీ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెల‌వ‌డం ఒక ఎత్తు అయితే.. గెలిచిన వారిలో చాలా మంది సీనియ‌ర్లు, త‌న‌కోసం త్యాగం చేసిన వారు... పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి త‌న‌వెంటే ఉన్న‌వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఎవ‌రికి ఏ ప‌ద‌వులు ఇవ్వాల‌న్నా చాలా మంది అలుగుతున్నారు.


రోజా లాంటి సీనియ‌ర్లే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఇదిలా ఉంటే ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబ‌ర్ల ఎంపిక కూడా జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఏపీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి సుబ్బారెడ్డికి కేటాయించ‌టంతో తమని కూడా బోర్డు మెంబర్లుగా అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌లువురు పార్టీ నేత‌లు జ‌గ‌న్‌ను అభ్య‌ర్దిస్తున్నారు. 


ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఇప్ప‌టికే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి పేర్లు జ‌గ‌న్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్రచారం జరిగింది. తూర్పు గోదావ‌రి నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో పోటీ చేసి ఓడిన‌ రౌతు సూర్య‌ప్ర‌కాశరావు లేదా పెద్దాపురంలో మాజీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌పై పోటీ చేసి ఓడిన తోట వాణిల్లో ఒక‌రికి అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది.


ఇక తెలంగాణ కోటాలో బాజీరెడ్డి గోవ‌ర్థ‌న్‌, మై హోం రామేశ్వ‌ర‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ ప‌ద‌వి ఆశిస్తున్నారు. క‌ర్ణాట‌క, త‌మిళ‌నాడు కోటాలో కూడా ఒక‌రికి మెంబ‌ర్లుగా అవ‌కాశం ఉంటుంది. దీంతో అక్క‌డ నుంచి కూడా ఎక్కువ మంది ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఇక ఏపీలో సొంత పార్టీ నేత‌ల నుంచి మాత్రం జ‌గ‌న్‌పై త‌మ‌కు బోర్డు స‌భ్యులుగా అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌ట్టిగా ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ట‌. ఇవే ఇప్పుడు జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: