మూడుసార్లు వాయిదా పడిన ఎంసెట్‌ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం నుంచి ప్రారంభం కానుంది. కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మొత్తం 191 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు రుసుము ఎంతన్న దానిపై శుక్రవారం రాత్రి విద్యాశాఖ జీఓ జారీ చేసింది.

 

వాటిలో హైకోర్టుకు వెళ్లిన 80 కళాశాలలతో పాటు మొత్తం 103 కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) శాశ్వత రుసుము నిర్ణయించింది. వచ్చే మూడేళ్ల వరకు ఆ కళాశాలలకు అవే అమలులో ఉంటాయి. ఇక మిగిలిన 88 కళాశాలలకు (కోర్టుకు వెళ్లనివి) తాత్కాలిక రుసుములు నిర్ణయించారు.

 

గత ఏడాది కంటే ఈసారి 15 నుంచి 43 శాతం వరకు రుసుములు పెరిగాయి. సగటున 20 శాతం పెరిగినట్లు అంచనా. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం రూ.లక్ష రుసుము దాటిన కళాశాలల సంఖ్య 20కి చేరింది. గతంలో అలాంటి కళాశాలలు నాలుగు మాత్రమే ఉండేవి.

 

రాష్ట్రంలో 2019-20 విద్యాసంవత్సరం నుంచి 2021-22 విద్యా సంవత్సరానికి వార్షిక రుసుము అత్యధికంగా సీబీఐటీలో రూ.1.34 లక్షలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. విద్యార్థులు ఆయా కళాశాలల్లో ప్రవేశం పొందే సమయంలో ప్రవేశం/రిజిస్ట్రేషన్‌/ గుర్తింపు రుసుము పేరిట రూ.2 వేలు చెల్లించాలి. అందులో రూ.500 కళాశాల యాజమాన్యం విశ్వవిద్యాలయానికి చెల్లిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: