ఏపీలో కుల రాజకీయాలు బలంగా ఉంటాయి. ప్రతీ ఎన్నికల్లోనూ కుల సమీకరణాలే ప్రభావితం చేస్తాయి. ఏపీలో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న కమలదళం ఇప్పుడే కుల బలం కోసమే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పాలైంది. ఇదే సమయంలో వైసీపీ మరింత బలంగా తయారైంది. ప్రస్తుతం వైసీపీకి ప్రత్యామ్నాయం ఏమీ లేదు.

 

ఈ పరిస్థితుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. వచ్చే ఎన్నికల నాటికి గెలుపు రుచి చూడాలన్న తాపత్రయంతో కమలదళం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం కుల సమీకరణాలతో పక్కా ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచీ కమ్మ సామాజికవర్గం మొత్తం కూడా ఎన్టీఆర్ కు అండగా నిలిచింది. ఇదే సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా నేతలుగా.. ఇలా అన్నిరంగాల్లోనూ దూసుకుపోయారు.

 

ఇక చంద్రబాబు కూడా సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు కమ్మ నేతలు బాగానే రాణించారు. 2014 ఎన్నికల్లో ఏపీలో గెలిచిన తర్వాత చంద్రబాబు ఎక్కువగా కాపు జపం చేయడం.. ఇదే సమయంలో బాబుకు వ్యతిరేకంగా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడం.. ప్రజల్లోనూ బాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత రావడం.. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయి కేవలం 23 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం తెలిసిందే.

 

ఈ పరిణామాల నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు నేతలు టీడీపీలో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. రాజకీయంగా చంద్రబాబు కూడా చాలా బలహీనపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు లాంటి నేతలను కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలందరూ చంద్రబాబును పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడున్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని నమ్మితే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం లేని కమ్మ నేతలంతా తమకు కమలం లాంటి పెద్దపార్టీనే మేలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: