విద్యా విధానానికి నిర్దిష్టమైన రూపుతో పాటు సంప్రదాయ విద్యనూ సమాంతరంగా అందించే దిశగా నిపుణుల సూచనలుండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు. విద్యా విధానంలో నూతన ఒరవడి తేవాలనే ధ్యేయంతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. నిపుణుల కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. బాలకృష్టన్‌, సభ్యుల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుల సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి కేబినెట్‌ సమావేశంలోనే విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యారంగంలో సమగ్ర శిక్షా అభియాన్‌ అమలుకు తగిన సూచనలు చేయాలని కమిటీని కోరారు. కమిటీకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నిపుణుల కమిటీ ఛైర్మన్‌ ఐఐఎస్‌ సి బెంగుళూరు ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ మాట్లాడుతూ విద్యా విధానాల్లో సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానాల వివరాలను పూర్తిగా అందిస్తే, వాటిపై సమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయగలమని వివరించారు.

 

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ డాక్టరు సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల్లేమితో బాలికలు చదువులు మానేస్తున్నారని, సంస్కరణలు రూపొందించటం కాదు, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: