కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని  కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలకు జగన్ సర్కార్ నోటీసులు జారీ చేసి వారం రోజులు గడువు విధించింది. కరకట్ట పై వెలిసిన అక్రమనిర్మాణదారులు  ఒకొక్కరుగా ప్రభుత్వ నోటీసులకు సమాధానం చెబుతున్నారు . తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్ , తన భవనానికి పంచాయితీ అనుమతులున్నాయని చెప్పుకొచ్చారు . ఇక స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చిందన్నారు .


ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను బహిర్గతం చేసిన ఆయన , పంచాయితీ అనుమతులున్నాయని చెప్పారే కానీ వాటిని బహిర్గతం చేసేందుకు ముందుకు రాలేదు . దీనితో కరకట్టపై వెలిసింది అక్రమ నిర్మాణమేనన్న నిర్ధారణకు సీఆర్డీఏ అధికారులు వచ్చారు . అయినా పూర్తి పత్రాలు అందజేయాలని మరోసారి రమేష్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . కరకట్టపై వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కు  ముందుకువెళ్లేందుకు జగన్ సర్కార్ న్యాయపరంగా అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .


ఒక్క లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ మాత్రమే కాకుండా , కరకట్ట పై మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది . ఈ రెండు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు . కరకట్టపైనున్న అన్ని అక్రమానిర్మాణాలను కూల్చివేస్తే , తన నిర్మాణాన్ని తానే కూల్చుకుంటానని గోకరాజు గంగరాజు ప్రభుత్వానికి సవాల్ చేశారు . అయితే వీరిద్దరి గెస్ట్ హౌస్ లే కాకుండా పలువురు ప్రముఖులు కరకట్టపై విలాసవంతమైన భవంతులు నిర్మించుకోగా , ఆధ్యాత్మిక గురువులు ఆశ్రమాలను నిర్మించుకున్నారు . ఇప్పుడు వీటన్నింటిని ప్రజావేదిక కూల్చినంత సులువుగా కూల్చడం అన్నది ప్రభుత్వానికి సవాలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: