తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ భ‌విష్యత్తుపై ఆ పార్టీ నేత‌ల‌కే స్పష్టమైన క్లారిటీ లేదు. ఐదేళ్ల త‌ర్వాత పార్టీ తిరిగి పుంజుకుంటుందా ? అన్న సందేహాలు చాలా మందికి ఉండ‌డంతో రాజ‌కీయంగా ఎవ‌రికి వారు త‌మ భ‌విష్యత్తు కోసం ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంమైన కుప్పం ఆయ‌న‌కు ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 1989 ఎన్నిక‌ల నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వ‌ర‌స‌గా ఓట‌మి అనేది లేకుండా కుప్పంలో చంద్రబాబు భారీ మెజారిటీతో విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు.

 

చంద్రబాబునాయుడును కేవలం 30 వేల మెజార్టీతో మాత్రమే గెలిపించారు. విచిత్రం ఏంటంటే సీఎంగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో నాలుగైదు రౌండ్లలో వెనుకబడ్డారు. చివ‌ర‌కు పుంజుకుని విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ సైన్యాన్ని వ‌దిలిపెట్టి ఏకంగా రాజుకే చెక్ పెట్టాల‌న్న ప్లాన్‌తో కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా కుప్పం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన జగన్ అక్కడ బీసీ సామాజికవర్గానికి చెందిన చంద్రమౌళికి సీటు ఇచ్చారు.

 

కమ్యూనిష్టుల‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్రబాబునాయుడు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రతిప‌క్ష నేత‌గా ఉన్నా ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఎప్పుడూ అఖండ మెజారిటీనే క‌ట్టపెట్టారు. ఈ సారి మాత్రం ఆయ‌న‌కు షాక్ త‌ప్పలేదు. విచిత్రం ఏంటంటే ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు ప‌త్యర్థి చంద్రమౌళి తీవ్రమైన ఆనారోగ్యంతో ప్రచారం కూడా చెయ్యలేదు. అయినా జ‌నాలు మాత్రం చంద్రమౌళికి అంచ‌నాల‌కు మించి ఓట్లు వేశారు.

 

కుప్పంలో చంద్రబాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓట్లు చాలా త‌క్కువ‌. ఇక్కడ ఆయ‌న సామాజిక‌వ‌ర్గం ఓట్లు లేకుండా కూడా ఆయ‌న ఆధిప‌త్యం ఏంట‌న్న కోణంలోనూ వైసీపీ ప్రజ‌ల్లోకి వెళుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్రబాబును ఇక్కడ ఎలాగైనా ఓడించాల‌న్న క్రమంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉన్న వ‌న్నికుల, రెడ్డి సామాజిక‌వ‌ర్గాలకు వైసీపీ బాగా ప్రయార్టీ ఇస్తోంది. ఇప్పటికే చంద్రబాబును టార్గెట్ చేసే బ్యాచ్ కుప్పంలో రెడీ అయింద‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: