తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అధిష్టానం నడుం బిగించింది. పాలనా హడావుడిలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారన్న అపవాదును తుడిచివేసేందుకు రంగం సిద్ధమైంది. పలువురు నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారాల నడుమ క్యాడర్‌ డీలా పడకుండా నూతనోత్తేజం నింపేందుకు అధినేత చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు.

 

మరో వైపు అధికారంలోకి వచ్చిన నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ పదే పదే చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు వెంటనే స్పందించే విధంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే త్రిసభ్య కమిటీలు తెరపైకి వచ్చాయి.

 

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు, ఇటీవల ఓటమిపాలైన నేతల స్థానంలో కొత్త నాయకత్వం ముందుకొస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న సీనియర్లలో 50 - 60 శాతం వైదొలిగి కొత్త రక్తం ఎక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతలు, వారిపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పార్టీ జెండాను మోయడానికి యువరక్తం ఆసక్తి కనబరుస్తోంది.

 

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అధిష్టానం వేసిన త్రిసభ్య కమిటీల్లో జిల్లాకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు చోటు కల్పించారు. కృష్ణా జిల్లా కమిటీలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు చోటు దక్కింది.

 

అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలపై వరుస దాడులు.. తమకు అండ ఎవరంటూ నిలదీస్తున్న క్యాడర్‌కు సమాధానంగా అధినేత చంద్రబాబు నిలుస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు కార్యకర్తలను కలుస్తూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. వారంలో ఐదు రోజులు గుంటూరులోనే ఉంటూ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తూ భరోసాను నింపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: