తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక‌నాటి ఉద్య‌మ స‌హ‌చ‌రుడు ఇప్పుడు నేరుగా ఆయ‌న‌పై ఉద్య‌మం మొద‌లుపెట్టారు. కేసీఆర్ చూపిన బాట‌లోనే అన్ని పార్టీలను క‌లుపుకొని పోరాటం చేప‌ట్టారు. ఈ పోరాటం చేసేది కేసీఆర్‌కు స‌మాంతరంగా కాకుండా నేరుగా ఆయ‌న‌పైనే కావ‌డం ఆస‌క్తిక‌రం. గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల‌లు కంటున్న కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణంపై ``రాష్ట్రంలో సెక్రటేరియట్, అసెంబ్లీలకు కొత్త భవనాలు కావాలా? చారిత్రక నిర్మాణాలు కూల్చివేసి కట్టుకోవాలా? రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్మాణాలు అవసరమేనా?..`` అనే ప్ర‌శ్న‌ల‌తో మాజీ ఎంపీ వివేక్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
త‌న తండ్రి జి.వెంకటస్వామి పేరుతో ఏర్పాటు చేసిన‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక్ ఈ రౌండ్‌టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనూరాధారెడ్డి, సోషల్ సైంటిస్ట్ సి.రాంచంద్రయ్య, ఎర్రమంజిల్ ప్యాలెస్ వారసులు షఫత్ ఆలీఖాన్ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ప‌లు తీర్మానాల‌ను ఆమోదించింది. 
- సెక్రటేరియట్ భవనాలను…. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చొద్దు.
- సెక్రటేరియట్, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలి. కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయొద్దు
- చారిత్రక – వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఉనికిని కాపాడాలి.
-ఈ డిమాండ్ల సాధనకు గవర్నర్ ను కలిసి మెమోరాండం ఇవ్వాలి. జిల్లాల్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలి. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలి. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్షం ప్రకటించింది.
- అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.
- కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: