శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్పొరేట్లకు భారీ నజరానాలు ప్రకటించిన బిజెపి ప్రభుత్వం, సాధారణ ప్రజలు, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని సిఐటియు విమర్శించింది. బడ్జెట్‌కు ముందుగా సమర్పించిన ఆర్థిక సర్వేలో చెప్పిన విధంగానే మోడీ ప్రభుత్వ విధాన అడుగులు, చెబుతున్న సంస్కరణలు పెట్టుబడిదారులకు అనుకూలంగా వున్నాయని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

 

దేశ సంపద సృష్టిలో అధిక భాగస్వామ్యం గల సాధారణ ప్రజలు, కార్మికులను లూటీ చేసి ఆ సొమ్మును ధనికులు, కార్పొరేట్లకు పంచిపెట్టే దుర్గార్మపు ఆలోచన చేస్తోందని మండిపడింది. బిజెపి ప్రభుత్వ హయాలో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా సాగుతుండగా, నిరుద్యోగం 45 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నా, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తన బడ్జెట్‌లో ఏమాత్రం దృష్టి సారించలేదని సిఐటియు పేర్కొంది.

 

గ్రామీణ వ్యవసాయ పరిశ్రమ రంగంలో నైపుణ్యం కలిగిన పారిశ్రామికవేత్తలను అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు 80 జీవనోపాధి వ్యాపార ఇంక్యుబేటర్లు, 20 టెక్నాలజీ వ్యాపార ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ నిర్ణయాలన్నీ వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ శక్తుల ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు ఉద్దేశించినవేనని విమర్శించింది.

 

తద్వారా రైతుల భూమి హక్కులను హరించడం, ఉత్పత్తిని నాశనం చేయడం వంటివి జరుగుతాయని సిఐటియు పేర్కొంది. వ్యవసాయం, వ్యవసాయ మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టడం, చిన్న, సన్నకారు రైతులకు సులువుగా రుణసౌకర్యం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి వంటి హామీలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించిందని తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎంతమాత్రం దృష్టి పెట్టలేదని అభిప్రాయపడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: