పెనుతుఫానులో సంద్రప్రయాణం చేసినట్టుంది.. కుమారస్వామి ప్రభుత్వానికి. బయటకు పదవులమీద మోజు లేదంటూనే, లోలోపల వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది, కుమార సర్కార్. మంత్రి పదవులు దక్కలేదని కొందరు- సంకీర్ణ సర్కారు కూరలో కరివేపాకులా మారిపోయామన్న బాధతో ఇంకొందరు- వెరసి శనివారం ఒక్కరోజే 13 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చీటీలు రాసిపారేశారు. సీనియరు నాయకుల పెత్తనం ఎక్కువైందని, మండలి, కార్పొరేషన్‌ పదవుల్లోనూ ఇతరుల జోక్యం అధికమైందంటూ ఆ లేఖాస్త్రాలు సంధించారు.

 

మరో వైపు- జనతాదళ్‌ నేతలు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి అప్పగిస్తే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కుమారస్వామి, దళపతి దేవేగౌడ ఎంత మాత్రం అంగీకరిస్తారన్నదే ఇప్పటి ప్రశ్న. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని దేవేగౌడ తన ఆప్తుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును మాత్రం పరిశీలించడానికి గౌడ అయిష్టంగా ఉన్నారనేదీ వెలుగులోకి వచ్చింది.

 

కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెడితే ఉప ముఖ్యమంత్రి పదవిని గౌడ పెద్ద కుమారుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణకు అందించే అవకాశాలపైనా అంచనాలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన విశ్వనాథ్‌ మినహా, మిగిలిన ఇద్దరు నేతలను బుజ్జగించే పనులను జనతాదళ్‌ ప్రారంభించింది.

 

ఇక వ్యూహకర్తగా పేరున్న దళపతి దేవేగౌడ తొలుత మౌనాన్ని ఆశ్రయించారు. సంక్షోభంపై బెంగళూరులో ఆదివారం ప్రశ్నించిన విలేకరులపై రుసురుసలాడారు. ‘కుమార’ ముఖ్యమంత్రిగా కొనసాగడం మీకు ఇష్టం లేనట్లుంది’ అంటూ కయ్యిమన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీ వీడకుండా రిసార్టులకు తరలించే ఆలోచనలో దళ్‌ నేతలు ఉన్నారు. ‘రివర్స్‌ ఆపరేషన్‌’ చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: