ఔను నిజ‌మే. ఎక్కువ క‌రెంటు బిల్లు క‌ట్టిన వారిపై..ఐటీ న‌జ‌ర్ ప‌డ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌రత్తు చేస్తోంది. క‌రెంటు బిల్లుకు, ఆదాయ‌పుప‌న్నుకు ఏంటి లింక్ అనుకుంటున్నారా?  కేంద్రం తాజాగా విడుద‌ల చేసిన ఆదేశాల్లో...ఈ రెంటికీ లింక్ ఉంది. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారిలో విదేశీ ప్రయాణాలు చేస్తున్నవారు, అధిక కరెంట్‌ బిల్లులు చెల్లిస్తున్నవారు కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ఆదేశాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


సెక్షన్‌ 139 ఆదాయ పన్ను చట్టం ప్రకారం అధిక స్థాయిలో లావాదేవీలు జరిపేవారిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం నూత‌న నిబంధ‌న‌లు రూపొందిస్తోంది. కేంద్రం తాజాగా విడుద‌ల చేసిన ఆదేశాల ప్ర‌కారం, ఏడాదికి విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలు దాటి ఖర్చు చేసిన వారు, బ్యాంకుల్లో కోటి రూపాయల కంటే అధికంగా డిపాజిట్‌ చేసిన వారు, లక్ష రూపాయల కంటే అధికంగా కరెంట్‌ బిల్లు చెల్లిస్తున్నవారు రిటర్నులు తప్పనిసరని తాజాగా స్పష్టంచేసింది. గ‌డిచిన సంవత్సరంలో కోటి రూపాయల కంటే అధికంగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారికి పన్ను వర్తింపచేయనున్నది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 54 కింద దాఖలు చేసినవారు దీర్ఘకాలికి క్యాపిటల్‌ గెయిన్‌ ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే గృహ, బాండ్ల కొనుగోలులో కూడా క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ప్రయోజనాలు పొందుతున్నారట. ఈ ప్రతిపాదన ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలులోకి రానుంది.


కాగా, ప‌న్నుల‌పై కేంద్రం స్పెష‌ల్ ఫోక‌స్ ఏ విధంగా ఉందో...తాజా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సార్వత్రిక బడ్జెట్‌లో సంపన్న వర్గాలపై అధిక పన్నుతోపాటు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే మాట్లాడుతూ, అదనపు పన్ను ప్రతిపాదనతో కేంద్రానికి అదనంగా రూ.30 వేల కోట్ల వరకు నిధులు సమకూరనున్నాయని  తెలిపారు. పన్నులను పెంచడం ద్వారా, ముఖ్యంగా ఇంధనాలపై విధించిన సెస్‌ ద్వారా అధికంగా నిధులు సమకూరనున్నాయని, పసిడి దిగుమతులపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచడం, రూ.2 కోట్ల కంటే అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్‌ రూపంలో విధించిన పన్ను ఇందుకు దోహదం చేస్తున్నదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: