ఉద్యోగం ఇవ్వకముందే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్లకు వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అక్టోబర్ నుంచి గ్రామవాలంటర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గ్రామంలో 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను ఏర్పాటు చేస్తారు.


ఈ గ్రామవాలంటీర్లు.. తమకు అప్పగించిన 50 కుటుంబాలకు సంబంధించిన అన్ని సంక్షేమపథకాల బాగోగులు చూసుకోవాలి. రేషన్ ఇంటికి తెచ్చి ఇవ్వాలి.. ఫించన్లు కూడా ఇంటికి వెళ్లి అందించాలి. కొత్త ఫించన్ అప్లికేషన్లు తీసుకోవాలి.


ఇలా ఒకటేమిటి.. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందడంలో వీరిదే కీలక పాత్ర. అందుకే ఇలాంటి కీలమైన ఉద్యోగంలో ఉన్నవారు.. ఏమాత్రం లంచాలకు అలవాటు పడినా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయం. అందుకే వీరి పట్ల కఠినంగా ఉంటానని జగన్ వార్నింగ్ ఇస్తున్నారు.


జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. గ్రామ వాలంటీర్లకు 5 వేల రూపాయల వేతనం ఇస్తున్నామని.. వీరిలో ఎవరైనా లంచాలు తీసుకుంటే.. ఏకంగా సీఎంఓకు ఫిర్యాదు చేసేలా ఓ నెంబర్ ఇస్తామని అన్నారు. వీరు లంచం తీసుకున్నట్టు తేలితే ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగం నుంచి పీకేస్తానని జగన్ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: