సీఆర్డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొద‌టి నుంచి డైన‌మిక్‌గా దూసుకుపోయే వ్య‌క్తిత్వం అనే సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అక్ర‌మ నిర్మాణాల‌పై  క‌న్నెర్ర చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రజలేవరూ మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ, స్థలాలు కానీ కొనొద్దన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని అక్రమాలు ఎన్ని చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసిన ఆర్కే... అక్రమంగా లే ఔట్లు వేసి వెంచర్లు చేశారు. నిబంధనలను పాటించలేదు, సుమారు 40 ఎకరాల్లో అక్రమంగా లేఔట్లు చేశారని మండిపడ్డారు. విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోదాన్ని రూ. 5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే... బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజు.. కాజా గ్రామానికి కట్టాల్సిఉన్నా ఇప్పటిదాకా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ. 4 వేలుగా చూపించారని.. సుమారు రూ. 40-50 కోట్లు పంచాయితీకి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టారని... అంతేకాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారు, ఆ కేసులను బెంచ్ పైకి రాకుండా మేనేజ్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి విజిలెన్స్ దర్యాప్తు కోరతామని ఆర్కే తెలిపారు. 


అయితే, ఈ దూకుడుతో ఆర్కే ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. కరకట్టను ఆధారంగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే భారీ వసూళ్లకు పాల్పడ్డారనికూడా ఆరోపించారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలో ఆర్కే వ‌సూళ్లు చేస్తున్నార‌ని, ఈ విష‌యం పెద్ద ఎత్తున చ‌ర్చ నీయాంశంగా మారింద‌ని అన్నారు.


అయితే, దీనిపై ఆర్కే ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మ అవినీతి బ‌య‌ట‌ప‌డ‌తుంద‌నే ఉద్దేశంతో క‌ర‌క‌ట్ట అక్ర‌మ నిర్మాణాల‌పై గ‌గ్గోలు పెడుతోంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌పై విమ‌ర్శ‌ల‌ను ద‌మ్ముంటే నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: