పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. అధికార కూటమికి చెందిన14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో తలెత్తిన పొలిటికల్ క్రైసిస్ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఆదివారమంతా కాంగ్రెస్, జేడీఎస్ కీలక నేతలు విడివిడిగా కొన్ని, ఉమ్మడిగా కొన్ని స‌మావేశాలు నిర్వహించారు. రాజీనామా చేసి, ముంబైలో మకాం వేసిన ఎమ్మెల్యేలను రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  అయితే, కుమారస్వామిని దింపేసి, సిద్ధరామయ్య లేదా వేరే నేతను సీఎంగా ప్రకటిస్తేనే తిరిగొస్తామని ‘రాజీనామా’ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఒకవేళ అదే కాంగ్రెస్ నిర్ణయమైతే ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని దేవెగౌడ ప్రకటించడంతో డ్రామా మరో మలుపు తిరిగినట్లైంది.


కాంగ్రెస్ నేత‌ల‌తో భేటీ తర్వాత జేడీఎస్ నేత దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించింది, వాళ్లను ముంబైకి తరలించింది సిద్ధరామయ్యేనని ఆరోపించారు. ‘‘నాకంతా తెలుసు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య అనుచరులే. సీఎం పోస్టు కోసమే నాటకాలాడుతున్నారు. వాళ్ల కుట్రలు తెలిశాక మేం మాత్రం ఎలా ఊరుకుంటాం? ఎట్టిపరిస్థితుల్లోనూ సిద్ధరామయ్యను సీఎం కానివ్వ‌ను. ఒకవేళ ఇదే కాంగ్రెస్ నిర్ణయమైతే మేం మద్దతు ఉపసంహరించుకుంటాం”అని దేవెగౌడ స్పష్టం చేశారు. 
కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం సీఎం మార్పుతోనే తొలుగుతుందన్న వాదనలు కాంగ్రెస్‌ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు డీకే శివకుమార్‌ చేసిన ఈ ప్రతిపాదనకు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ్‌ కూడా సుముఖమని తెలుస్తోంది. 


రాజీనామాలు చేసి ముంబై వెళ్లిపోయిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, గందరగోళానికి ముగింపు పలికేలా పరిష్కారం సిద్ధం చేశామని మంత్రి డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు. అతి త్వరలోనే అంతా సర్దుకుంటుందని, కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రే అన్నారు. ఈ ఇద్దరు నేతలతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర తదితరులు ఆదివారం జేడీఎస్ సీనియర్ నేత దేవెగౌడ ఇంటికెళ్లి మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవాలని, ఆ క్రమంలో ఎవరు త్యాగాలు చేయాల్సివచ్చినా వెనుకాడొద్దని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: