రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల క‌లిగే న‌ష్టం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ప్రాణ‌, ఆస్తిన‌ష్టం ఎన్నో కుటుంబాల‌ను తారుమారు చేస్తోంది.  అయితే, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వాహనాల టైర్లను సిలికాన్, రబ్బరు మిశ్రమంతో తయారుచేస్తూ.. ఆ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ నింపడం తప్పనిసరిచేస్తూ తయారీదారులకు ఆదేశాలిచ్చే ప్రతిపాదనపై కేంద్రం యోచిస్తోంది. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.  ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. 


అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. సిలికాన్, రబ్బరు మిశ్రమంతో తయారుచేసి, నైట్రోజన్‌తో నింపిన టైర్లు ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. ఇలాంటి టైర్లు తక్కువగా పేలుతాయి. అయితే, వాహనాల టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్‌ని నింపితే ప్రమాదాలు తగ్గుతాయా? అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.  గాలిలో సుమారు 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. సాధారణ వాయువులో నీటి ఆవిరి కూడా ఉంటుంది. మాములు గాలితో నింపిన టైర్లలో పీడనంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మామూలు వాయువుతో పోలిస్తే రబ్బరు టైరులో నైట్రోజన్ స్థిరంగా ఉంటుంది. దీంతో టైరు లోపలి పీడనం స్థిరంగా ఉంటుంది. అందుకనే, రేసర్లు తమ వాహనాల టైర్లను శుద్ధ నైట్రోజన్‌తో నింపుతారు. నైట్రోజన్‌తో నింపిన టైర్లలో పీడనం స్థిరంగా ఉండటంతో టైర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు... ఇంధన ఖర్చు కూడా కొంచం తగ్గుతుందని అంటారు. 


వాతావరణంలో మారే ప్రతీ 10 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత మూలంగా టైర్లలో 1 పీఎస్‌ఐ(పీడనం) మారుతుంది. దీంతో టైరుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ మార్పు నైట్రోజన్ వాయువుతో నింపిన టైర్లలో, మామూలు గాలితో నింపిన టైర్లలో ఒకే విధంగా ఉంటుంది. టైర్లలోని పీడనంలో హెచ్చుతగ్గులను సరిగ్గా చూసుకుంటే టైర్ల ప్రమాదాలు తగ్గి, మన్నిక పెరుగుతుంది విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే, టైర్లలో సాధారణ వాయువును నింపడం కంటే, నైట్రోజన్‌ను నింపితే, టైర్ల మన్నిక, ఇంధనం ఆదాతో పాటు రిమ్‌లు తుప్పుపట్టకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ గాలిలో నీటి ఆవిరి ఉండటం వల్ల స్టీలు లేదా అల్యూమినియంతో తయారుచేసే రిమ్‌తో నీటి ఆవిరి రసాయనిక చర్య జరిగి తుప్పు పట్టే అవకాశమున్నది. టైర్లలో నింపే నైట్రోజన్‌లో నీటి ఆవిరి ఉండదు. దీంతో రిమ్‌లు తుప్పుపట్టే అవకాశం ఉండదు. టైర్లు క్రియాశీలంగా, పాడవకుండా ఉండటానికి నైట్రోజన్‌ను వాడితే సరిపోదని అమెరికాలోని బ్రిడ్జ్ స్టోన్ టైర్ల సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ కెయిత్ విల్ తెలిపారు. బ్రిడ్జ్ స్టోన్ సంస్థ టైర్లలో గాలి లేదా నైట్రోజన్ వాయువును నింపడానికి ప్రాముఖ్యత ఇవ్వదు. రెండు వాయువులు కూడా సమానమే. టైరుపై రెండు వాయువులూ సమానంగానే పీడనాన్ని కలుగజేస్తాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: