తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్‌ హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ హ‌త్య‌కు విజ‌య‌వాడ‌తో ఉన్న లింకులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో పంజాగుట్ట పోలీసులు ఈ కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన వ్యాపారి కోగంటి సత్యం కీలక సూత్రధారి అని అనుమానిస్తున్న పోలీసులు దానికి బలం చేకూర్చేలా పలు కీలక ఆధారాలు కూడా సేకరించిట్టు సమాచారం. స్టీల్ వ్యాపారంలో తనను మోసంచేసి ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా కొంద‌రు పోలీసు అధికారులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టించాడ‌ని భావించిన స‌త్యం ఇందుకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సుపారీ గ్యాంగ్‌ను రంగ‌ప్ర‌వేశం చేయించిన స‌త్యం రాంప్ర‌సాద్‌ను చంపించార‌ని పోలీసులు నిర్ధారించుకున్న‌ట్లు తెలుస్తోంది. 


పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయ‌గా విస్మ‌య‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కోగంటి సత్యంతో రాంప్రసాద్‌కు కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి వ్యాపారం చేసినప్పటికీ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో విభేదాలు తలెత్తి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు తేల్చారు. దీంతో ప‌గ పెంచుకొని రాంప్ర‌సాద్‌ను చంపించార‌ని స‌మాచారం. ఇందుకుగాను స‌త్యం డ‌బ్బులు ఇచ్చి కొంద‌రితో క‌లిసి రాంప్ర‌సాద్‌ను మ‌ట్టుబెట్టార‌ని తెలుస్తోంది. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని మంగళవారం గచ్చిబౌలిలో పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం సత్యంకు చెందినదని గుర్తించారు. రాంప్రసాద్‌ను తామే హత్య చేశామంటూ శ్యాంతోపాటు అతడి అనుచరులు చోటూ, రమేశ్, నరేశ్ సోమవారం మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నలుగురిని వేర్వేరుగా విచారించడంతో పలుకీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.


సత్యం అనుచరుడే శ్యాం అని తేలడంతోపాటు.. శ్యాం కూడా రాంప్రసాద్‌పై పగ పెంచుకొన్నట్టు బయటపడింది. నిందితుల విచారణలో కొత్త పేర్లు కూడా బయటపడినట్టు తెలిసింది. సుపారీ గ్యాంగ్‌తో క‌లిసి తాము హ‌త్య చేసిన‌ట్లు శ్యాం అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విషయాలను నిర్ధారించుకొనేందుకు పోలీసు బృందాలు విజయవాడకు వెళ్లి మరింత సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. విజ‌య‌వాడ‌లో చేసే ద‌ర్యాప్తు ఆధారంగా సుపారీ గ్యాంగ్‌తో ఏం డీల్ కుదుర్చుకున్నారు? ఎక్క‌డెక్క‌డ ఇందుకు స్కెచ్ వేశారు? వ‌ంటి అంశాల‌తో పాటుగా హ‌త్యకు సంబంధించిన పూర్తి ఆధారాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. మొత్తంగా పోలీసులు ఒకట్రెండురోజుల్లో కేసును కొలిక్కి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: