కర్ణాటక రాజ‌కీయం మ‌రింత ముదురుతోంది. కర్ణాటకలో అసెంబ్లీ నుంచి తప్పుకున్న 16 మంది అధికార పక్షాల ఎమ్మెల్యేల రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతుండ‌గా మ‌రోవైపు నేటినుంచి కర్ణాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అప్రమత్తమైంది. దీంతో మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది.


అధికార పార్టీలకు చెందిన 16 మంది (13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్) ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సంక్షోభానికి కార‌ణ‌మైన రాజీనామా చేసిన పది మంది రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్‌కుమార్ బేఖాతరు చేశారు. తాను మెరుపు వేగంతో పనిచేయలేనని తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ముందు హాజరైన పది మంది రెబల్స్.. తాజాగా మరోసారి రాజీనామాలను సమర్పించారు. వారి రాజీనామాలన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నా, వారు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, వారు సమర్పించిన పత్రాలు నిజమైనవేనా అన్నది నిర్ధారించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. 


అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడిన నేపథ్యంలో కుమారస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ యెడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేశారు. అయితే, తన రాజీనామా కోసం వస్తున్న డిమాండ్లను సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. నేనెందుకు రాజీనామా చేయాలి? ఆ అవసరమేమొచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. 2009-10లో మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు నాటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారని, కానీ ఆయన రాజీనామా చేయలేదని కుమరస్వామి గుర్తు చేశారు. దీంతోపాటుగా క‌ర్నాట‌క సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి.. బ‌ల‌ప‌రీక్ష‌కు డిమాండ్ చేశారు. ఇవాళ అసెంబ్లీ మొద‌లైన త‌ర్వాత‌.. బ‌ల‌ప‌రీక్ష పెట్టాలంటూ స్పీక‌ర్‌ను సీఎం కుమార‌స్వామి అభ్య‌ర్థించారు. దానికి టైం ఫిక్స్ చేయాల‌ని కోరారు. కొంద‌రు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌.. రాష్ట్ర రాజ‌కీయాలు అనేక మ‌లుపులు తిరుగుతున్నాయ‌ని సీఎం అన్నారు. అందుకే విశ్వాస ప‌రీక్ష కోసం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఎం చెప్పారు. 


బ‌ల‌ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో  బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు శివారులోని రిసార్టులకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో భాగమైన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇరు పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి రమదా రిసార్ట్‌కు తరలిస్తోండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: