తెలంగాణ ఉద్య‌మం స‌మయంలో పొలిటిక‌ల్ జేఏసీ ద్వారా, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో స‌మానంగా పాపుల‌ర‌యిన వ్య‌క్తి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. అనంత‌రం రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్‌తో విబేధాలు, సొంత పార్టీ పెట్టుకోవ‌డం, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో వైఫ‌ల్యం చెంది ఒక్క చోట కూడా గెలుపొంద లేక‌పోవ‌డం...వీట‌న్నింటినీ కోదండ‌రాం రుచి చూశారు. తాజాగా తెలంగాణ జన సమితి ప్లీనరీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆపార్టీ చీఫ్ కోదండ‌రాం ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. 


రాజకీయాలలో మార్పు తీసుకురావడానికే పార్టీ ఏర్పాటు చేసినట్లు కోదండ‌రాం చెప్పారు. నిరంకుశ పాలనకు చమరగీతం పాడాలనే తాము పొత్తు పెట్టుకోవాల్సివచ్చిందని కోదండరామ్ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో పొత్తులు ఫలించలేదని… పార్టీలు బాహుబలి కోసం వెతికారని.. నిజమైన బాహుబలి ప్రజలేనని అన్నారు. జరిగిన తప్పులు గుర్తించామని మళ్లీ వాటిని రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు. ``ఏడు దశాబ్దాల కొట్లాట, ఎందరో బిడ్డల త్యాగాల  ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న ఆశల్లో  ఒక్కటి కూడా తీరలేదు. కేసీఆర్ పరిపాలన సీమాంధ్ర పాలన లాగానే ఉన్నది.  కేసీఆర్‌‌ మన రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి  ఫ్యూడల్‌‌ దొరల పద్ధతిల పాలన చేయాలనుకుంటున్నరు. తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లెవరూ దీనిని యాక్సెప్ట్‌‌ చేయడానికి సిద్ధంగా లేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, కల్పించిన సమానత్వాన్నీ  కోల్పోడానికి రెడీగా లేరు  సొంత రాష్ట్రం వచ్చి తెలంగాణ బిడ్డలే పరిపాలిస్తే,  రాష్ట్రంలో డెవలప్‌‌మెంట్‌‌ అంతా ప్ర‌జ‌ల కేంద్రంగా ఉంటుందని ఆశించాం. పాలసీలన్నీ ప్రజల కోసమే ఉంటాయని అనుకున్నం. సర్కారు ఖర్చు పెట్టే ప్రతిపైసలో ప్రజలకు వాటా దక్కాలని కోరుకున్నం. సోషల్‌‌, ఎకనామికల్‌‌, కల్చరల్‌‌, వెల్ఫేర్‌‌… అన్ని రంగాల్లోనూ డెవలప్‌‌మెంట్‌‌ ఉంటుందని నమ్మినం. కేసీఆర్‌‌ సర్కారు అన్ని ఆశలను దెబ్బతీసింది.`` అని మండిప‌డ్డారు. 


తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం సుమారు 1,13,000 కోట్ల రూపాయల అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.``తెలంగాణల వందేళ్ల నుంచి ఆర్థిక, రాజకీయ,  సాంస్కృతిక సమానత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలకు వారసులుగా ఉన్నవాళ్లు జేఏసీ లోపలా బయటా  ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణ వచ్చిన త‌ర్వాత కేసీఆర్‌‌  ప్రజావ్యతిరేక పాలన మీద కొట్లాడేందుకు అందరూ కలిసీ తెలంగాణ జనసమితిగా ఏర్పడ్డారు. కేసీఆర్‌‌ పాలనతోని  తెలంగాణ ఎటూగాని పరిస్థితుల్ల పడింది. రాజకీయంగా సంక్షోభం ఉంది.  ఈ విషయాలను అర్థం చేసుకొని  టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంతో పోరాటం జేసేందుకు పక్కా యాక్షన్‌‌ ప్లాన్‌‌ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ప్రజలు కేంద్రంగా ఉండే రాజకీయాల కోసం ఒక పెద్ద  ప్రజా ఉద్యమాన్ని నిర్మించే పనిలో ఉన్నాం. అందుకు అవసరమైన వ్యూహాల రూపకల్పన కోసమే ప్లీనరీని నిర్వహిస్తున్నాం.`` అని ప్ర‌క‌టించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: