నారాయణ మూర్తి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సుప్ర‌సిద్ధ టెక్నాల‌జీ కంపెనీగా ఇన్ఫీని తీర్చిదిద్దారు. తాజా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఇన్ఫోసిస్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. సంస్థ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో విభేదాలను ప్రస్తావించారు. తాము ఎంతో కష్టపడి నిర్మించిన ఇన్ఫోసిస్ పరువు, ప్రతిష్ఠలను సిక్కా గంగపాలు చేశారన్నారు. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోవడాన్ని తాను భరించలేకపోయానని దీంతో గళమెత్తాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ఇక్క‌డితో ఆపేయకుండా దేశం గురించి ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


ఇన్ఫోసిస్ సీఈఓగా విశాల్ సిక్కాను నారాయ‌ణ‌మూర్తి ఏరికోరి తెచ్చుకున్నారు. 2014లో సంస్థ సారథ్య బాధ్యతలను అప్పగించారు. సిక్కా నియామకంతో తొలిసారి ఓ వ్యవస్థాపకేతర వ్యక్తి ఇన్ఫోసిస్ సీఈవోగా ఎన్నిక‌య్యే అవ‌కాశం క‌ల్పించారు. తన తర్వాత సంస్థకు దిశా-నిర్దేశం చేస్తారని భావించారు. కనీవినీ ఎరుగని రీతిలో జీతభత్యాలనూ అందించారు. కానీ సిక్కా వైఖరి, సంస్థ యాజమాన్యం పరిపాలనా విధానాలు మూర్తికి ఎంతమాత్రం నచ్చకపోవడంతో వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే సిక్కా తీరుపై మూర్తి మండిపడగా, ఆ తర్వాతి పరిణామాలతో 2017లో ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ పగ్గాలు మళ్లీ నందన్ నీలేకనీ చేతికి వచ్చాయి.

మూడు దశాబ్దాలకుపైగా శ్రమించి ఇన్ఫోసిస్‌ను దేశీయ ఐటీ రంగంలో ఓ దిగ్గజ సంస్థగా నిలబెట్టామంటూ నారాయణ మూర్తి గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.నేడు దేశంలో ఏం జరుగుతున్నది?.. అని ప్రశ్నించారు. యువత నిర్మొహమాటంగా నిలదీయాలని, దేనికైనా చర్చకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన పెద్దలు.. ఇప్పుడున్న సమాజాన్ని ఏమాత్రం హర్షించరని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అవినీతిని కడిగి పారేయాలని, నిర్మొహమాటంగా చర్చించే నైజాన్ని యువత అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. తాను కూడా చూసీచూడనట్లుగా ఉంటే ఇన్ఫోసిస్ పరిస్థితి ఏమైపోయేదోనన్న భయాందోళనను మూర్తి ఈ సందర్భంగా వ్యక్తం చేయడం గమనార్హం. నిజానికి భారతీయులు ఎవరినీ నొప్పించరని, మృధు స్వభావులన్న ఆయన అవసరమైనప్పుడు కూడా ఊదాసీనత పనికి రాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: